మరణించిన రైతు కుటుంబసభ్యులపై కేసు..

మృతిచెందినట్టు వెల్లడైన రైతు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Published : 06 Feb 2021 01:51 IST

ఫిలిభిత్: జాతీయ పతాకాన్ని అవమానించారని.. మరణించిన ఓ రైతు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బల్విందర్‌ సింగ్‌ అనే రైతు యూపీలోని భోపత్‌పూర్‌ గ్రామానికి చెందిన వారు. జనవరి 23న గాజీపూర్‌కు చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి దిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు.. దిల్లీ పోలీసులు ఆయన కుటుంబానికి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం, సింగ్‌ మృతదేహాన్ని అప్పగించారు. బల్విందర్‌ సింగ్‌ మృతదేహానికి బుధవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జాతీయ పతాకాన్ని కప్పారు. అయితే ఈ చర్య ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌’ ప్రకారం విరుద్ధమని.. ఈ కారణంగా ఆయన భార్య, సోదరుడు, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సెరామావు నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు.

కాగా, వ్యవసాయదారులు కూడా సైనికుల మాదిరిగానే దేశం కోసం పోరాడుతున్నారని.. రైతులకు మద్దతుగా తమ సోదరుడు, వారి కోసమే మరణించాడని మృతుని సోదరుడు వివరించారు. ఆ కారణంగానే దేశభక్తిపూర్వకంగా మృతదేహంపై జాతీయ పతాకాన్ని కప్పామని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

రైతుల ముందు మేకులా?

సైనికులకు ద్రోహం చేశారు.. రాహుల్‌ గాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని