సులభంగా డబ్బు సంపాదించడమెలా?... యూట్యూబ్‌లో చూసి ఏం చేశాడంటే?

సులభ మార్గంలో త్వరగా డబ్బు సంపాదించాలని బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

Published : 03 Apr 2022 01:37 IST

గుంటూరు: సులభ మార్గంలో త్వరగా డబ్బు సంపాదించాలని బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన పల్లా రాజేశ్‌ కుమార్‌(27) ఐటీఐ ఫిట్టర్‌ కోర్సు పూర్తి చేశాడు. ఉద్యోగం చేస్తే పెద్దగా సంపాదన ఉండదని.. సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో చూసి బ్యాంకు దొంగతనాలు  చేయడం తెలుసుకున్నాడు. అందుకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేశాడు.

2021 ఆగస్టులో గుంటూరులోని గాంధీ పార్కు ఎదురుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.23 లక్షలు చోరీ చేశాడు. ఆ తర్వాత లాలాపేట పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజేశ్‌ను అరెస్టు చేసి గుంటూరు జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మార్చి 30వ తేదీ అర్ధరాత్రి ఫిరంగిపురం ఎస్‌బీఐ బ్యాంకులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుచేసి ఆర్ధరాత్రి చోరీకి ప్రయత్నించాడు. బ్యాంకు లోపలికి ప్రవేశించి స్ట్రాంగ్‌ రూమ్‌ లాక్‌ను కట్‌ చేసి డబ్బు, బంగారం ఉన్న లాకరును తెరిచే క్రమంలో అలారం మోగింది. దీంతో బ్యాంకు పక్కనే నివాసం ఉంటున్న బ్యాంకు సిబ్బంది వెంటనే బ్యాంకు వద్దకు వచ్చారు. ఇది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బ్యాంకు మేనేజరు ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడే సమయంలో సీసీ కెమెరాలకు చిక్కినా గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌస్‌లు ధిరంచేవాడు. స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు చెప్పారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన నరసరావుపేట గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని