
Crime news: మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చి.. నేనే చంపానంటూ పెద్దగా అరిచి..!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కొట్టాయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన రౌడీ షీటర్.. అనంతరం మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చి పోలీస్‌స్టేషన్ ముందు పడేశాడు. తానే చంపినట్లు పెద్దగా అరిచి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
జోమోన్ కె జోస్ అనే ఓ రౌడీ షీటర్.. గంజాయి, డ్రగ్స్ దందా నిర్వహిస్తూ ఉంటాడు. పాత కక్షల కారణంగా షాన్ బాబు (19) అనే యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి షాన్ బాబును ఇంట్లో నుంచి జోమోన్ తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో యువకుడి తల్లి అర్ధరాత్రి కొట్టాయం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు కూడా అతడి కోసం గాలిస్తున్నారు.
ఓ వైపు పోలీసులు గాలిస్తుండగానే.. అర్ధరాత్రి నుంచి షాన్ బాబును జోమోన్ చిత్రహింసలకు గురిచేస్తూ కొట్టాయంలోని పలు ప్రాంతాలకు ఆటోలో తిప్పాడు. చివరకు అతను మరణించాడని భావించి పోలీసుస్టేషన్ ముందు పడేసి లొంగిపోయాడు. జోమోన్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఠాణాకు తీసుకువచ్చినప్పుడు అతడు మద్యం, గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.