logo

కరదీపిక.. మార్గ సూచిక

ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలంటే అధికారులతో పాటు ఎన్నికల సిబ్బంది పాత్ర ఎంతో కీలకం.

Updated : 16 Apr 2024 06:13 IST

పకడ్బందీగా విధులు నిర్వర్తించేలా పుస్తకాల అందజేత 

దండేపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలంటే అధికారులతో పాటు ఎన్నికల సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. నామపత్రాల సమర్పణ నుంచి మొదలు ఫలితాలు వెలువడే వరకు అధికారులు, ఎన్నికల సిబ్బంది వివిధ రకాల విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ప్రక్రియ విజయవంతం అవుతుంది. నిబంధనల విషయంలో కానీ ఇతరత్రా ఎక్కడ చిన్న అజాగ్రత్తగా వ్యవహరించినా తప్పులు దొర్లినా  ఇబ్బందులు తప్పవు. చిన్నచిన్న పొరపాట్లు సైతం నిర్వహణపై ఎంతో ప్రభావాన్ని చూపే అవకాశముంది. ముందే నిబంధనలకు అనుగుణంగా అధికారుల నుంచి సిబ్బంది వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ  ఇవ్వడంతో పాటు ఏవీ చేయాలో ఏవీ చేయకూడదో తెలియజేసే పుస్తకాలను అందజేశారు.

చేయవలసినవి... చేయకూడనివి...

గతంలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), సహాయ పోలింగ్‌ అధికారు(ఏపీఓ)లకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఒకసారి, ఎన్నికల సమయంలో మరోసారి రెండు సార్లు శిక్షణ ఇచ్చేవారు. దీంతో పాటు వీరికి ఎన్నికల నియమావళిపై కరదీపికలు అందజేసేవారు.  శిక్షణ ఇచ్చినప్పటికీ ప్రతీసారి చిన్నచిన్న పొరపాట్లు దొర్లుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి చేయవలసినివి.. చేయకూడనివి పేరుతో ప్రత్యేక పుస్తకాలు అందజేశారు. ఇందులో ప్రత్యేకంగా పంపిణీ కేంద్రం వద్ద, పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్‌పోలింగ్‌, పోల్‌ ప్రారంభం, ముగింపు, ఈవీఎం, వీవీప్యాటు సీల్‌, ఇతర సామగ్రి సీల్‌ చేయడం తదితర అంశాలపై పొరపాట్లకు తావు లేకుండా ఎలా చేయాలో పుస్తకాలు రూపొందించారు. పుస్తకం తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లోనూ పుస్తకాలు ఎన్నికల విధులు నిర్వర్తించే పీఓ, ఏపీఓలకు అందజేశారు.

సిబ్బందికి శిక్షణ

ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రిసైడింగ్‌ (పీఓ), సహాయ పోలింగ్‌ అధికారులతో (ఏపీఓ) పాటు ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీఓ)లు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి అందరికీ శిక్షణ ఇచ్చారు. గతంలో కేవలం ప్రిసైడింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులకు మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. కానీ ఈసారి పీఓ, ఏపీఓలతో పాటు ఓపీవోలకు కూడా ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎన్నికల సామగ్రి తీసుకోవడం నుంచి మొదలు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ చేసుకోవాల్సిన ఏర్పాట్లు, మాక్‌పోల్‌ నుంచి పోలింగ్‌ ముగిసి ఈవీఎంలతో పాటు సామగ్రి  అధికారులకు అందించే వరకు సిబ్బంది సమన్వయంతో ఎలా విధులు నిర్వహించాలే అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.

అనుమానాల నివృత్తికి..

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈసారి చెక్‌లిస్ట్‌ అనే మరో పుస్తకాన్ని అందజేశారు. గతంలో ఈ వివరాలన్నీ కరదీపికలోనే ఉండేవి. ప్రిసైడింగ్‌ అధికారులకు ఏదైనా చిన్న సందేహం వస్తే పుస్తకమంతా తిరగేయాల్సి వచ్చేది. చెక్‌లిస్ట్‌ పుస్తకంలో వివిధ అంశాలు, వాటికి సంబంధించిన సందేహాల నివృత్తి కరదీపికలో ఏ పేజీలో ఉన్నాయో ముద్రించారు. దీంతో ఆ అంశానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే ఆ పేజీ తీసి చదువుకోవచ్చు. దీంతో తక్కువ సమయంలో అనుమానం నివృత్తి చేసుకునే అవకాశముంది. ఇందులో ప్రధానంగా ప్రిసైడింగ్‌ అధికారులు విధులు, పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్‌పోల్‌, ఏజంట్ల నియామకాలు, ఈవీఎంల నిర్వహణ, మొరాయిస్తే చేపట్టాల్సిన చర్యలు, పోలింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసాధారణ, సంక్లిష్ట సందర్భాలు, పోలింగ్‌ ముగింపు, నమోదైన ఓట్లు , సీలింగ్‌ తదితర అంశాలు పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని