logo

ఠాణాల్లోనే.. వసూళ్లు!

న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కే వారు అక్కడ వసూళ్ల పర్వాన్ని చూసి విస్తుపోతున్నారు

Published : 16 Apr 2024 02:49 IST

అనిశాకు పట్టుపడుతున్నా.. మారని పోలీసులు

సోమవారం ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో అనిశా అధికారులు పట్టుకున్న నగదు

ఈనాడు, ఆసిఫాబాద్‌: న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కే వారు అక్కడ వసూళ్ల పర్వాన్ని చూసి విస్తుపోతున్నారు. రక్షక భటులుగా ఉన్న వారు నేరుగా బేరసారాలకు దిగడంతో తలలు పట్టుకుంటున్నారు. స్టేషన్‌ బెయిల్‌ నుంచి, గొడవ కేసులు, అత్తమామల వేధింపులు, చోరీ.. తదితర కేసుల్లో కాసులు విదిల్చితేనే పనులు జరుగుతాయనే అపవాదును పలువురు పోలీసులు మూటగట్టుకుంటున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెదలాలని ఉన్నతాధికారులు ఎంత చెప్పినా.. అనేక మంది తీరు మారడం లేదనే విమర్శలు ఉన్నాయి. భూములకు సంబంధించిన వివాదాల్లో తల దూర్చుతూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి.  

తాజా ఘటనను ఒకసారి పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన యాహియాఖాన్‌ గత నెల చివరి వారంలో ఆసిఫాబాద్‌కు కారులో వస్తుండగా బూరుగూడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దాని చోదకుడు గాయపడ్డాడు. యాహియాఖాన్‌పై ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన వాహనాన్ని విడిపించుకోవడంతోపాటు, స్టేషన్‌ బెయిల్‌ మంజూరు కోసం ఎస్సై రాజ్యలక్ష్మి డబ్బులు డిమాండ్‌ చేయగా.. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. రూ.25 వేలు ఎస్సై తీసుకుంటుండగా వారు సోమవారం పట్టుకున్నారు. నిబంధనల మేరకు 41(ఏ) స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఎస్‌హెచ్‌ఓ (సీఐ) అనుమతి తప్పనిసరి. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.? లేక ఎస్సై నేరుగా బాధితుడితో మాట్లాడి ఈ డబ్బులు డిమాండ్‌ చేశారా.? అనే విషయం విచారణలోనే తేలనుంది.

మా తీరింతే అన్న చందంగా..

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. అనేక చోట్ల గొలుసు మద్యం దుకాణాలు విచ్చలవిడిగా రాత్రీపగలు తేడా లేకుండా నడుస్తున్నాయి. ఇసుకాసురులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా లారీల్లో ఇసుకను రెబ్బెన నుంచి జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు. పత్తి, కందుల కొనుగోలు దుకాణాలు అనుమతి లేనివి వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. చాలా చోట్ల పోలీసుల అండతో భూ మాఫియా వ్యక్తులు స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. వాంకిడి, కౌటాల మండలాల నుంచి పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. వీటన్నింటికీ కొందరు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారనే వాదన ఉంది. అనిశాకు వరుసగా పట్టుపడుతున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

అవినీతి మరకలు..

  • గతేడాది అక్టోబరు 24వ తేదీన చింతలమానేపల్లి ఎస్సై వెంకటేశ్‌ రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు. ఓ వివాహిత వ్యక్తిగత కారణాలతో మహారాష్ట్రకు వెళ్లగా అందుకు సహకరించిన వ్యక్తిపై కేసు నమోదైంది. అనంతరం వివాహిత తిరిగి వచ్చినా, ఈ కేసు తప్పించడానికి ఎస్సై రూ.70 వేలు డిమాండ్‌ చేయగా.. బాధితుడు రూ.20 వేలు ఇచ్చి అనిశాను ఆశ్రయించారు. సదరు ఎస్సై ఇక్కడికి రాక ముందు కెరమెరిలో పనిచేశారు. అదే ఏడాది మే నెలలో సుర్దాపూర్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.50 లక్షల విలువ చేసే పైపులు మాయమైన విషయం గ్రామస్థులు చెప్పినా.. వాటి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఓ హత్య కేసులోనూ నిందితులను గుర్తించలేదనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
  • గత సంవత్సరం ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన రెబ్బెన ఎస్సై భవానీసేన్‌ సస్పెండ్‌ అయ్యారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో జోరుగా సాగుతున్న గుట్కా, మట్కా, గుడుంబా, మద్యం వ్యాపారానికి సహకరిస్తున్నారని గత రెండు సంవత్సరాల కాలంలో పలువురు ఎస్సైలను ఎస్పీ కార్యాలయానికి ఉన్నతాధికారులు అటాచ్‌ చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని