logo

ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం

ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బజార్‌హత్నూర్‌ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్‌ సుమన్‌బాయి అలియాస్‌ రజిత మృతి చెందారు.

Updated : 18 Apr 2024 05:31 IST

ఎన్‌కౌంటర్‌లో సుమన్‌బాయి మృతి

ఈటీవీ - ఆదిలాబాద్‌: ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బజార్‌హత్నూర్‌ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్‌ సుమన్‌బాయి అలియాస్‌ రజిత మృతి చెందారు. అంజనీబాయి-లోబాజీ దంపతుల ఏడుగురు పిల్లల్లో సుమన్‌బాయి మూడో సంతానం. పాతికేళ్ల కిందట అప్పటి పీపుల్స్‌వార్‌ కార్యకలాపాలకు బోథ్‌ నియోజకవర్గం స్థావరంగా ఉండేది. అదే ప్రాంతానికే చెందిన సూర్యం అలియాస్‌ పండరి, ప్రస్తుత జిల్లా కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ ప్రభావం బలంగా ఉండేది. 1997లో ఉద్యమానికి ఆకర్షితురాలైన సుమన్‌బాయి తన 16వ ఏటా పీపుల్స్‌వార్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. పీపుల్స్‌వార్‌లో క్రియాశీలక నాయకురాలిగా ఎదిగారు. చాలా సార్లు పోలీసుల ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నా పార్టీని వీడలేదు. ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా పోలీసు ఉన్నతాధికారులెంతో మంది ఆమె స్వస్థలం డెడ్రాకు వెళ్లి కుటుంబ సభ్యులతో లొంగిపోవాలని సూచించిన సందర్భాలున్నా సుమన్‌బాయి అడవిబాట వీడలేదు. చివరికి అదే ఉద్యమంలో ప్రాణాలను వదలడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. కానీ ఆమె ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచిగానీ, పోలీసుల నుంచిగానీ ఎలాంటి సమాచారం అందలేదు. ఎన్‌కౌంటర్‌ మృతుల వివరాలు అధికారికంగా వెల్లడి కావటం లేదు. సుమన్‌బాయి మరణించారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.

మాజీల సమాచారం మేరకు : ఎస్పీ గౌస్‌ ఆలం

బస్తర్‌ ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను పరిశీలించిన మాజీల సమాచారం మేరకు డెడ్రాకు చెందిన సుమన్‌బాయి మృతి చెందినట్లు వెల్లడవుతోందని ఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు. కానీ అధికారికంగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించాల్సి ఉందన్నారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో ఉన్న వాళ్లు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. విలువైన ప్రాణాలను కోల్పోకూడదని సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా అందించాల్సిన సాయం సకాలంలో అందిస్తామని ‘ఈనాడు’తో చరవాణిలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని