logo

Cibil Score: కొంప ముంచుతున్న సిబిల్‌ స్కోరు

పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది.

Updated : 20 Apr 2024 14:29 IST

వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్ల విముఖత

ఆదిలాబాద్‌ శివాజీ కూడలిలో పండ్లు విక్రయిస్తున్న వీధి వ్యాపారులు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. అందులో చాలామందికి సిబిల్‌్ స్కోరు అంటే ఏమిటో తెలియదు. అది లేకపోవడం వారికి శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం ‘స్వనిధి’ పథకం కింద రూ.10 వేలు, రూ.20 వేల రుణాన్ని సులభంగా పొందిన వ్యాపారులు రూ.50 వేల రుణానికి నోచుకోవడం లేదు. సిబిల్‌ స్కోరు తక్కువగా ఉందనే కారణంతో వీధి వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో వేలాది మంది వీధి వ్యాపారులు నష్టపోతున్నారు. మొదటి, రెండో విడతల్లో రుణాలు పొందిన వ్యాపారులు మూడో విడతకు వచ్చే సరికి లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది.

‘పీఎం స్వనిధి’తో ఆర్థిక చేయూత

నాలుగేళ్ల కిందట కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో వీధి వ్యాపారుల బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయి. తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డాక చిన్న వ్యాపారాలు చేసుకునే వారు పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి(పీఎం స్వనిధి) పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులను ఇచ్చి బ్యాంకు రుణాలను మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.10 వేలు అందించగా, తిరిగి చెల్లించిన వారికి రెండో విడత కింద రూ.20 వేల రుణాలను బ్యాంకర్లు ఇచ్చారు. రెండేళ్ల కిందట మూడో విడతగా ప్రభుత్వం రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లను ఉచితంగా అందజేసింది. నెలలో 100కు పైగా డిజిటల్‌ లావాదేవీలను చేసిన వ్యాపారులకు రూ.100 క్యాష్‌బ్యాక్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తోంది.

మూడో విడత రుణానికే కొర్రీలు

మొదటి విడతగా రూ.10వేలు, రెండో విడతగా రూ.20వేల రుణాలకు ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేసిన బ్యాంకర్లు, మూడో విడత కింద రూ.50 వేల రుణానికి మాత్రం సిబిల్‌ స్కోరు మెరుగ్గా ఉంటేనే రుణాలు ఇస్తామని లేకుంటే ఇవ్వమని చెప్పేస్తున్నారు. ప్రతినెలా సకాలంలో వాయిదాలు చెల్లిస్తేనే సిబిల్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఒక్కో సీజన్‌లో వ్యాపారం సరిగా సాగకపోతే వాయిదాల చెల్లింపులో ఆలస్యమవుతుంది. దీంతో సిబిల్‌ స్కోరు పడిపోతుంది. వాస్తవానికి పీఎం స్వనిధి పథకానికి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు ఇస్తోంది. ఒకవేళ రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే అలాంటి వారి ఖాతాలను కేంద్ర ప్రభుత్వమే సెటిల్‌ చేస్తుంది. రెండేళ్ల కిందట రూ.10 వేలు, రూ.20 వేల రుణాలు తీసుకున్న వారు కొంత మంది బ్యాంకులకు డబ్బులు కట్టకపోతే ఆ బకాయిలను ప్రభుత్వమే చెల్లించింది. మొదటి, రెండో విడత కింద తీసుకున్న రుణాలకు ఎలాంటి షరతులు చెప్పని బ్యాంకర్లు రూ.50 వేల రుణానికి సిబిల్‌ స్కోరును వర్తింపజేయడంతో వీధి వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆదిలాబాద్‌లోని చించర్‌గల్లికి చెందిన ఈమె పేరు పి.సునీత. గుల్లలు, చాటలు చేసి రోడ్డుపై విక్రయిస్తున్నారు. రూ.50 వేల రుణం కోసం బ్యాంకుకు అవసరమైన పత్రాలను సమర్పించారు. ఈమె సిబిల్‌ స్కోరు 624 ఉంది. అది 650 దాటితేనే రుణం ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. అప్పటిదాకా ఈమెకు అసలు సిబిల్‌్ స్కోరు అంటే ఏమిటో తెలియదు. ఇది ఈమె ఒక్కరి సమస్యే కాదు. ఇలాంటి చిరు వ్యాపారులు చాలామంది ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో రూ.50 వేల రుణానికి నోచుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని