logo

వనమిత్రపై శీతకన్ను

పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

Published : 21 Mar 2023 01:20 IST

నాలుగేళ్లుగా ముందుకు కదలని పనులు
న్యూస్‌టుడే, అనంతగిరి

అసంపూర్తిగా వనమిత్ర సముదాయం

పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన కొన్నిచోట్ల ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించగా.. అనంతగిరి మండలంలో చివరి దశకు వచ్చిన పనులు నాలుగేళ్లుగా అలాగే నిలిచిపోయాయి.

పర్యటకులకు మన్యం ముఖద్వారమైన చిలకలగెడ్డ వద్ద అటవీశాఖ ఠాణా స్వాగతం పలుకుతుంది. సుదూర ప్రాంతం ప్రయాణించి వచ్చే పర్యటకులు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవటంతో పాటు అల్పాహారం తీసుకునే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమిత్ర ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఒక భవనం ఏర్పాటుతో పాటు.. అటవీశాఖ వద్ద లభించే రకరకాల ఆయుర్వేద మొక్కలు, ఇతర మొక్కలతో దీని ఆవరణలో నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మొక్కల విక్రయం ద్వారా అటవీశాఖకు కొంత ఆదాయం వచ్చేలా, ఇతర ఆకర్షణలతో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ అటవీ ప్రాంతం.. పలు రకాల మొక్కల నర్సరీ మధ్యలో ఈ భవనం ఏర్పాటు చేయటంతో పర్యటకులకు మంచి అనుభూతి ఇవ్వొచ్చని అటవీ శాఖ భావించింది. ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇవ్వడంతో చిలకలగెడ్డలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

రూ.10 లక్షల కేటాయింపు

గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తంతో పనులు చేపట్టిన అటవీశాఖ అధికారులు చివరిదశలో నిధులు చాలక నిలిపేశారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి అటవీశాఖ అధికారులు నివేదికలు పంపించారు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దీనిపై శీతకన్ను వేసింది. ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ వనమిత్ర భవనం నిర్మాణం కూడా పూర్తి కాకుండానే పిచ్చిమొక్కలు మొలిచి భవనం శిథిలావస్థకు చేరింది. స్థానిక అటవీశాఖ సిబ్బంది తమ సొంత నిధులతో ఇటీవల భవనమంతా శుభ్రం చేయించే పనులు చేపట్టారు.


నిధులు విడుదల కాలేదు..

వనమిత్ర భవనానికి అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. కానీ మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే మిగతా పనులు చేపట్టి పర్యటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

దుర్గాప్రసాద్‌, రేంజ్‌ అధికారి అనంతగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని