logo

సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ ప్రాథమికంగా గుర్తించారు.

Published : 29 Mar 2024 03:03 IST

పెదబయలు మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇంజరిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ ప్రాథమికంగా గుర్తించారు. మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పూర్తిగా షెడ్యూల్డ్‌ ప్రాంతమైన అల్లూరి జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉంది. జిల్లాలో తొంభై శాతం గ్రామాలకు రోడ్డు, రవాణాతోపాటు కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు. ఇలాంటి ప్రాంతంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడం ఎన్నికల సంఘానికి ప్రతిసారి సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత తొలి సాధారణ ఎన్నికలు కావడంతో సమర్థంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సున్నిత, అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నివేదిక రూపొందించారు.

  • జిల్లా పరిధిలో 248 పోలింగ్‌ స్టేషన్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అత్యధికంగా ముంచంగిపుట్టు మండలంలో 50 పీఎస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. పాడేరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు.
  •  జిల్లాలో 281 కేంద్రాలు చిన్న, చిన్న తగాదాలు జరిగే సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. పాడేరు మండలంలో 30, జి.మాడుగులలో 27, అడ్డతీగలలో 22, ఎటపాకలో 16 కేంద్రాలు వరకు ఉన్నాయి. చింతూరు, ముంచంగిపుట్టు మండలాల్లో సున్నిత పోలింగ్‌ కేంద్రాలు లేవని అధికారులు పేర్కొన్నారు.
  •  రాజకీయంగా, సామాజిక తగాదాలకు ఆస్కారమున్న అత్యంత సున్నిత కేంద్రాలు 211 ఉన్నాయి. జిల్లాలో 740 పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అరకులోయ, న్యూస్‌టుడే: ఎన్నికలు సజావుగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ విజయ సునీత పేర్కొన్నారు. గురువారం అరకులోయ వచ్చిన ఆమె తహసీల్దారు కార్యాలయంతోపాటు చొంపి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి పంపిణీలో ఎటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ పీవో అభిషేక్‌, తహసీల్దార్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి అంశంపై శిక్షణ  

పాడేరు, న్యూస్‌టుడే: ఎన్నికల సిబ్బందికి ప్రతి అంశంపై శిక్షణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత సూచించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చే సూచనలు, నిబంధనలు, మార్పులు, చేర్పులు గమనిస్తుండాలన్నారు.  సమాచారం చేరవేయడంలో అలసత్వం, జాప్యం ఉండకూడదని హెచ్చరించారు. ఈవీఎంల వినియోగంలో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రిటర్నింగ్‌ అధికారులు భావన, వి.అభిషేక్‌, డీఆర్‌ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎక్సైజ్‌, సెబ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ విజయ సునీత, ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు