logo

వైకాపా అధికారం.. విశాఖలో అంధకారం

ఒకటి, రెండు రోజులు వీధి దీపాలు వెలగకపోతే ఏదైనా సమస్య తలెత్తిందని అనుకోవచ్చు. నెలల తరబడి పనిచేయకపోతే.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోతే.. దాన్ని ఏమనుకోవాలి..? వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో ఇలాంటి దుస్థితే నెలకొంది.

Updated : 10 Apr 2024 09:53 IST

చీకట్లలో నగర జనం.. వీధుల్లో వెలగని దీపాలు

నిర్వహణలో జగన్‌ సర్కారు వైఫల్యం

న్యూస్‌టుడే, విశాఖపట్నం: ఒకటి, రెండు రోజులు వీధి దీపాలు వెలగకపోతే ఏదైనా సమస్య తలెత్తిందని అనుకోవచ్చు. నెలల తరబడి పనిచేయకపోతే.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోతే.. దాన్ని ఏమనుకోవాలి..? వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో ఇలాంటి దుస్థితే నెలకొంది. రాత్రిళ్లు వీధులు అంధకారంలో ఉంటున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు.

తెదేపా హయాంలో రూ. 85 కోట్లతో..

పదేళ్ల కిందట హుద్‌హుద్‌ తుపానుకు నగరంలో వీధి దీపాలన్నీ రాలిపోయాయి. చాలా వరకు స్తంభాలు విరిగిపోయాయి. నాడు తెదేపా ప్రభుత్వం రూ.85 కోట్లతో 85,672 ఎల్‌ఈడీ దీపాలను ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) సహకారంతో ఏర్పాటు చేయించగలిగింది. ఆయా దీపాలను ఏడేళ్లపాటు ఈఈఎస్‌ఎల్‌ నిర్వహించింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిన్నరపాటు ఆ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో బాధ్యతల నుంచి వైదొలిగింది. అనంతరం ఏడాదిన్నరపాటు గుత్తేదారును జీవీఎంసీ నియమించలేదు. ఎనిమిది నెలల క్రితం ఓ సంస్థకు గుత్తకిచ్చినా వీధి దీపాల నిర్వహణ గాడిలో పడలేదు.

గుత్తేదారుకు అండగా నాయకులు..

గుతేదారుకు నిర్వహణ నిమిత్తం జీవీఎంసీ ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తోంది. అతను నగర పరిధిలో 400 మంది కార్మికులను నియమించుకుని దీపాలకు మరమ్మతులు చేయడం, కొత్తవి అమర్చడం చేయాలి. అలా చేస్తే లాభసాటిగా ఉండదన్న ఉద్దేశంతో గుత్తేదారు వైకాపా నాయకులను కలిసి ప్రసన్నం చేసుకున్నాడు. కేవలం 140 మంది కార్మికులతోనే వీధి దీపాల నిర్వహణ చూస్తున్నారు. గుత్తేదారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. దీనికి వైకాపా నాయకుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిబంధనల మేరకు వీధి దీపం ఆరిపోయిన తరువాత ప్రతి 24 గంటలకు రూ.50 చొప్పున అపరాధ రుసుము విధించి, గుత్తేదారుకు ఇచ్చే బిల్లులో మినహాయించాలి. అయితే నెలల తరబడి దీపాలు వెలగకపోయినా జీవీఎంసీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

ఏకంగా వ్యవస్థే రద్దు..

వీధి దీపాలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జీవీఎంసీలో ప్రత్యేకంగా విభాగం ఉండేది. కొద్ది నెలల క్రితం దాన్ని పూర్తిగా తొలగించారు. సాధారణ పనులు పర్యవేక్షించే ఇంజినీర్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. వారు ఇతర వ్యవహారాల్లో ఉంటూ వీధి దీపాలను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక విభాగం ఉన్నప్పుడు రాత్రి 11 గంటల వరకు పర్యవేక్షించేవారు. వారుంటే గుత్తేదారుపై ఆర్థిక భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో విభాగాన్నే తొలగించినట్లు విమర్శలొస్తున్నాయి. మధురవాడ, కొమ్మాది, అనకాపల్లి, భీమిలి, పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో వీధి దీపాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితిపై గుత్తేదారుకు రెండు నోటీసులు ఇవ్వాలి. మార్పు రాకుంటే  మూడో నోటీసు ఇచ్చి అతన్ని తొలగించాలి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.


2014లో తెదేపా హయాంలో ఎల్‌ఈడీ దీపాలు: 85,672
నిర్వహణ తీరు: 85 శాతం (72,821) దీపాలు వెలిగేవి.
నాడు నెలకు ఖర్చు: రూ. 3 కోట్లు


2021లో వైకాపా పాలనలో ఎల్‌ఈడీ దీపాలు: 1,11,024
నిర్వహణ తీరు: 58 శాతం (64,393) దీపాలు వెలిగేవి.


2024 నాటికి (ప్రస్తుతం) దీపాలు: 1,20,732
నిర్వహణ తీరు: 57 శాతం (68,834) దీపాలు వెలుగుతున్నాయి.
ప్రస్తుతం నెలకు ఖర్చు: రూ. 8 కోట్లు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు