logo

కర్షక కంటకుడు

ఉమ్మడి జిల్లా మొత్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములున్నా కేవలం 4.19 లక్షల ఎకరాలకే వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాలువల నుంచి నీరందే అవకాశం ఉంది. మిగతా భూముల్లో సాగు వర్షాధారంపైనే సాగుతోంది.

Published : 16 Apr 2024 02:41 IST

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నర్సీపట్నం గ్రామీణం, మునగపాక, చీడికాడ  

నాడు

తెదేపా హయాంలో నీరు-చెట్టు పథకం కింద పంట కాలువలను బాగు చేసుకున్నారు. శివారు ఆయకట్టు వరకు నీరుపారేలా చూసుకున్నారు. కాలువల నిర్వహణకు నీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. పనులేవైనా వారి ఆధ్వర్యంలోనే జరిగేవి. సాగునీటికి భరోసా ఉండేది.


నేడు..

వైకాపా సర్కారు వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో సాగునీరు ఒకటి. నిధుల్లేక.. నిర్వహణకు నోచుకోక పంట కాలువలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నీటి సంఘాలు కనుమరుగయ్యాయి. గతంలో చేసిన నీరు-చెట్టు పనులపై విచారణ జరిపించడంతోనే ఈ అయిదేళ్లు గడిపేశారు తప్ప ఒక్క సాగునీటి కాలువను బాగు చేయలేదు.


అసంపూర్తి సిమెంటు లైనింగ్‌తో పూడుకుపోయిన కోనాం కాలువ

మ్మడి జిల్లా మొత్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములున్నా కేవలం 4.19 లక్షల ఎకరాలకే వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాలువల నుంచి నీరందే అవకాశం ఉంది. మిగతా భూముల్లో సాగు వర్షాధారంపైనే సాగుతోంది. వర్షాభావం ఏర్పడితే పంటలకు విరామం ఇవ్వాల్సి వస్తోంది. గతేడాది ఖరీఫ్‌లో తీవ్ర కరవుఛాయలు అలుముకున్నాయి. సుమారు 40 వేల ఎకరాల్లో వరి నాట్లు వేయలేకపోయారు. వర్షాలు పడినా కాలువల్లో నీరుపారే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పంట కాలువలన్నీ పూడికలతో నిండిపోయాయి, కోతకు గురై ఎక్కడికక్కడ నీరు వృథాగా పోతుంది. వాటిని బాగు చేయడానికి ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నా పైసలు మాత్రం సర్కారు విదల్చడం లేదు. దీంతో కొన్నిచోట్ల రైతులే చందాలేసుకుని కాలువలు బాగు చేసుకున్నారు.


ప్రతిపాదనలే మిగిలాయ్‌..

తుప్పలతో నిండిన రావణాపల్లి బోదికాలువ

గొలుగొండ మండలంలో కొత్తూరు కాలువను మూడు కి.మీ మేర సిమెంట్‌ లైనింగ్‌ చేయడానికి, గబ్బాడ ఆనకట్ట తలుపులను మరమ్మతు చేయించేందుకు రూ.2.5 కోట్ల ఖర్చు అంచనాలతో ప్రతిపాదనలు పంపి రెండేళ్లు గడిచింది. పరిపాలనా ఆమోదం వచ్చింది గాని సాంకేతిక ఆమోదం ఇప్పటికీ రాలేదు. గొలుగొండ మండలం విప్పలపాలెం ఆనకట్ట కింద 18 వందల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలో పూడిక పెరిగిపోయి నీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదు. పూడికతీత, సిమెంట్‌ లైనింగ్‌ పనులకు రూ.50 లక్షలు అవసరం. నాతవరం మండలం వెదుళ్లగెడ్డ గేట్లు మరమ్మతుకు రూ.40 లక్షలు అవసరం. ఐదేళ్లుగా వీటికి ప్రతిపాదనలు పంపుతున్నా పైసా విదల్చడం లేదు.


కోనాం కాలువలు చూస్తే కన్నీళ్లే!

సిరిజాంలో షట్టర్ల దుస్థితి, మర్లగుమ్మిలో పైకి లేవని షట్టర్లు

చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం పరిధిలోని ఐదు మండలాల్లో 14,450 ఎకరాల ఆయకట్టు ఉంది. మర్లగుమ్మి సాగునీటి కాలువలో సిమెంటు లైనింగ్‌ కొన్నాళ్లగా అసంపూర్తిగా వదిలేశారు. షట్టర్లు ఎక్కడా సక్రమంగా లేవు. కొన్నిచోట్ల ఉన్నా పని చేయడంలేదు. రైతులే వాటికింద రాళ్లు.. ఇసుక బస్తాలను వేసుకుని నీటిని మళ్లించుకుంటున్నారు. ఎల్‌పీ ఛానల్‌-1, 2, సిరిజాం సాగు కాలువలు మరింత అధ్వానంగా ఉన్నాయి. ఏటా వేసవిలో జలవనరుల శాఖ అధికారులు కాలువల బాగుకు నిధుల కోసం ప్రతిపాదిస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు


గేట్లు ఎత్తేవారే లేరు..

ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీరు శివారు ఆయకట్టుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరేలా నిత్యం పర్యవేక్షించేందుకు లస్కర్లు ఉండాలి. ఉమ్మడి జిల్లాలో 105 మంది లష్కర్లు పనిచేసేవారు. పదవీ విరమణ తర్వాత నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. 99 మంది లస్కర్ల కొరత ఉంది. వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత నీటి సంఘాలను రద్దుచేసి వాటి స్థానంలో జలవనరులశాఖ అధికారులకే బాధ్యత అప్పగించారు. పోనీ వీరైనా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు.


ఇవిగో కాలువల దుస్థితి..

  • నర్సీపట్నం, కోటవురట్ల మండలాల్లో 1,910 ఎకరాలకు సాగు నీరందించాల్సిన దుగ్గాడ కాలువలో ఆరు గేట్లు తుప్పుపట్టి పాడైపోయాయి. రెండేళ్లుగా వీటిని బాగుచేయడం లేదు. కనీసం గేట్లయినా బాగు చేయిస్తే సాగునీరు ఏదోలా మళ్లించుకుంటామని జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్‌కు రైతులు మొర పెట్టుకున్నారు.
  • పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని తాండవ కాలువల్లో స్లూయిస్‌లు దెబ్బతినడంతో నీరు పారడం లేదు. శ్రీరాంపురం, ఒడ్డిమెట్ట, మంగవరం ప్రాంతాల్లో స్లూయిస్‌లు వద్ద తలుపులు ఊడిపోయాయి. గుంటపల్లిలో స్లూయిస్‌ పూర్తిగా ధ్వంసమైంది. గోనె సంచులు, అరటిచెట్లు అడ్డుపెట్టుకుని నీటిని మళ్లించుకోవాల్సి వస్తోంది.
  • మాకవరపాలెం మండలంలో తూటిపాల ఆనకట్ట రెండేళ్ల క్రితం 40 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఆనకట్ట పునరుద్ధరణ పనులకు రూ. 25 లక్షలు అవసరమని జలవనరులశాఖ రెండుసార్లు ప్రతిపాదించినా నిధులు విడుదల కాలేదు.

మునగపాక మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నాగులాపల్లి ఛానల్‌ ఇది. వానలు పడినా ఇందులో నీరు పారే అవకాశం ఉందా? చేను తడిసే వీలుందా.. జగన్‌ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి


ఈ మామిడి చెట్టు మునగపాక మండలం అరబుపాలెంలో సాగునీటి కాలువలో ఉంది. నాలుగేళ్లలోకాలువలో చుక్కనీరు కూడా పారలేదనడానికి ఈ చెట్టే సాక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని