logo

మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్‌వైజర్‌

మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

Published : 18 Apr 2024 02:01 IST

నిందితుడు వైకాపా మద్దతుదారుడు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కోనేటి నాగవెంకట పద్మారావు ఆరు మద్యం సీసాలు తరలిస్తూ దొరికాడని ఎస్సై జోగారావు తెలిపారు. ప్లాస్టిక్‌ సంచిలో సీసాలను తీసుకువెళుతూ, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. అతని నుంచి అనుమతి లేకుండా ఉన్న ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

వైకాపా నాయకులతో చెట్టపట్టాల్‌...

పద్మారావు మద్యం దుకాణంలో ఔట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. వైకాపా నాయకుల సమావేశాలకు తరచూ హాజరవుతుంటాడు. ఎన్నికల కోడ్‌ వచ్చినా సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల వైకాపా అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు పరిచయ కార్యక్రమాన్ని కల్యాణ మండపంలో నిర్వహించారు. దీనిలోనూ పద్మారావు పాల్గొన్నారు. కంబాల జోగులు సిద్ధం గోడపత్రిక విడుదల చేసినపుడు ఆయనతోనే ఉన్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన తహసీల్దార్‌ సూర్యనారాయణను వైకాపా మండలశాఖ అధ్యక్షుడు చిక్కాల రామారావు, జడ్పీటీసీ సభ్యుడు లంకా సూరిబాబు తదితర నాయకులతో కలిసి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.  పద్మారావు గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా వైకాపా నేతలకు నేరుగా మద్యాన్ని సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని