logo

నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!

విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది.

Updated : 24 Apr 2024 04:29 IST

 పునరావాసం.. పచ్చి మోసం
అయిదేళ్లుగా హామీలతోనే కాలయాపన
ఒక్క గ్రామాన్నీ తరలించని జగన్‌ ప్రభుత్వం

విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. చివరిదశలో తెదేపా ప్రభుత్వం మారిపోయింది. పాలన పగ్గాలు చేపట్టిన వైకాపా నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. చివరి దశలో ఉన్న కాలనీలను పూర్తి చేసి గ్రామాలను తరలించాల్సి ఉన్నా అయిదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గ్రామాన్నీ తరలించలేకపోయింది

చింతూరు, కూనవరం, దేవీపట్నం న్యూస్‌టుడే

క్షణక్షణం భయంతో బతుకు బండిని లాగిస్తున్న పోలవరం నిర్వాసితులకు అయిదేళ్ల వైకాపా పాలన తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏటికేడాది గోదావరి వరదలతో అతలాకుతలం అవుతున్న ముంపు మండలాల నిర్వాసితులకు గత ఎన్నికల సమయంలో వైకాపా అధినేత ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని హామీల వల వేశారు. ఆ వలలో చిక్కుకున్న నిర్వాసితులు అవన్నీ నిజమని నమ్మి ఆ పార్టీకి ముంపు మండలాల్లో పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి హామీలు అమలవుతాయని ఎదురుచూసిన నిర్వాసితులకు అయిదేళ్ల తరువాత నిరాశే మిగిలింది. చివరకు గోదావరి వరదలో మునిగి హాహాకారాలు చేసినా కాస్తంత కనికరం కూడా చూపలేకపోయింది ఈ కర్కశ ప్రభుత్వం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసం, ప్యాకేజీ ఇచ్చే లక్ష్యంతో నీటి నిల్వసామర్థ్యాన్ని బట్టి ముంపునకు గురవుతున్న గ్రామాలను కాంటూరుల వారీగా విభజించారు. కాఫర్‌డ్యామ్‌ నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాలను 41.15 కాంటూరు పరిధిలో, మిగిలిన గ్రామాలను 45.72 కాంటూరు పరిధిలో చేర్చారు. కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం పూర్తయినందున 41.15 కాంటూరు పరిధిలోని 107 గ్రామాలను రెండేళ్ల క్రితమే ఖాళీ చేయించాల్సి ఉంది. కానీ పోలవరం, దేవీపట్నం మండలాల్లోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలను ఇప్పటికీ ఖాళీ చేయించలేకపోయారు.

 మాట తప్పనన్నారు.. నాలుక మడత పెట్టేశారు
నేనున్నానన్నారు.. గోదాట్లో ముంచేశారు
ఆదుకుంటామన్నారు.. ఆపదలోకి తోసేశారు..
పరిహారమిస్తామన్నారు.. పరిహాసం చేశారు..
పోల‘వరాన్ని’.. నిర్వాసితుల పాలిట శాపంగా మార్చేశారు!

30 శాతం పనులూ చేయలేదు

 వరరామచంద్రాపురం మండలం జీడిగుప్ప నిర్వాసితులకు కూనవరం మండలం భైరవపట్నం వద్ద అప్పటి తెదేపా ప్రభుత్వం కాలనీ నిర్మాణాన్ని చేపట్టింది. 160 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి సుమారు 70 శాతం పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికీ ఈ కాలనీలో అంతర్గత దారులు (సిమెంట్‌) వేయలేదు. కొన్ని ఇళ్ల పనులు పూర్తి కాలేదు. మరుగుదొడ్లు, అలమరల పనులు జరగలేదు. బడి, గుడి, అంగన్‌వాడీ, సామాజిక భవన నిర్మాణాలు అయిదేళ్లుగా పునాదుల్లోనే మగ్గుతున్నాయి. వరదల భయంతో జీడిగుప్ప గ్రామానికి చెందిన తొమ్మిది కుటుంబాలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాయి. వారికి పూర్తిస్థాయి వనరులు సమకూరలేదు. నేటికీ వారు రేషన్‌ కోసం, ఓట్లు వేయడానికి సొంత గ్రామానికి వెళ్లాల్సిందే.

పునరావాస కాలనీలో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం

ప్రచారం కోసం పట్టాలు

కూనవరంలోని బొజ్జరాయిగూడెంలో 216 కుటుంబాలను తరలించాల్సి ఉంది. రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వడం కోసం రాయనపేటలో 32 మందికి, చోడవరంలో 32 మందికి, పాండురంగాపురంలో 10మందికి కలిపి 216 ఎకరాలు తీసుకొన్నారు. వీటికి నిర్వాసితుల పేరున పట్టాలు కూడా ఇచ్చారు. నిర్వాసిత రైతులు ఆ భూముల్లో సాగు చేయడానికి వెళితే యజమానులు ‘ప్రభుత్వం తమకు ఇప్పటివరకు నగదు చెల్లించలేదు. కాబట్టి మీకు అప్పగించలేమని’ వారిని వెనక్కు పంపారు. ప్రచారం కోసం పట్టాలిచ్చారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరదలతో మరికొన్ని గ్రామాల గుర్తింపు

రెండేళ్ల క్రితం జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన గోదావరి వరదలు ముంపు మండలాలను అలకల్లోలం చేశాయి. బాధితులకు కనీస సాయం అందలేదు. ప్రభుత్వంపై బాధితులంతా ఆగ్రహంగా ఉండటం గుర్తించి వైకాపా సర్కారు 41.15 కాంటూరులో కొత్తగా మరో సర్వే చేసింది. వీటిలో గుర్తించిన గ్రామాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఖాళీ చేయిస్తామని ప్రకటించింది. రెండు నెలల్లో పరిహారం ఇచ్చేస్తామని, పునరావాస కాలనీ కోసం స్థలాలు సిద్ధమవుతున్నాయని వైకాపా నాయకులు హంగామా చేశారు. ఇది జరిగి ఏడు నెలలు అవుతున్నా ఆ ఊసే లేదు.

దేవీపట్నం మండలంలోని నిర్వాసితులు ఊళ్లు వదిలి దాదాపు మూడేళ్లు గడిచిపోతోంది. పునరావాసం లభించక పలు చోట్ల రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ అద్దెలు చెల్లిస్తూ నివసిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.

2022 వరదల్లో చిక్కుకున్న చింతూరు

హామీలు హామీలుగానే..

‘2008, 2010లో జరిగిన భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.40 లక్షలిచ్చారు. ఇది చాలా తక్కువ, వైకాపా ప్రభుత్వం ఏర్పడగానే ఎకరాకు రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. వ్యక్తిగత పరిహారం తెదేపా ప్రభుత్వం రూ. 6.30 లక్షలిస్తే, దానిని రూ. పది లక్షలిస్తాం. అగ్గిపెట్టె లాంటి ఇళ్లు కాదు... విశాలమైన గదులతో అన్ని మౌలిక వసతులున్న కాలనీలు నిర్మిస్తాం.

 ఇవీ గత ఎన్నికల ప్రచార సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలు. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు.

  • ‘41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను 2022 సెప్టెంబరు నెలాఖరుకల్లా పునరావాస గ్రామాలకు తరలిస్తాం. నిర్వాసితులకు అండగా ఉంటాం’

2022 వరదల సమయంలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది. రెండేళ్లు గడిచినా ముంపు గ్రామాల గోడు పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని