logo

ఏదీ ప్రగతి జాడ ?

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామికవాడ(మోడల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు), ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్‌ పార్కు) నెలకొల్పేలా అయిదేళ్ల కిందటే గత ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు పూర్తి

Published : 28 Jun 2022 05:53 IST

మల్లవల్లిలో మందకొడిగా పరిశ్రమల స్థాపన

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే


పూర్తి కాని రైల్‌నీర్‌ ప్రాజెక్టు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామికవాడ(మోడల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు), ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్‌ పార్కు) నెలకొల్పేలా అయిదేళ్ల కిందటే గత ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు పూర్తి చేసి, పరిశ్రమల స్థాపన వేగవంతం చేసే దిశగా కార్యాచరణ ఆరంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికవాడ ప్రగతి మందగించింది.

ల్లవల్లిలో సర్వే సంఖ్య 11లో ఉన్న 1,460 ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామికవాడ నెలకొల్పేందుకు ఆరేళ్ల కిందట బీజం పడింది. చకచకా రైతులకు పరిహారం చెల్లించి, భూమిని ఏపీఐఐసీకు అప్పగించారు. ఆ తర్వాత మౌలిక వసతుల పనులు, భూ కేటాయింపులు చేసి పట్టా లెక్కించారు.

ఇదీ ప్రణాళిక:  వందెకరాలను మెగా ఫుడ్‌పార్కుకు కేటాయించింది. ఇందులో 57.45 ఎకరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఫుడ్‌పార్కుకు అనువుగా లేఅవుట్‌ వేసి రూ.13.20 కోట్లతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు చేపట్టారు. రూ.200 కోట్ల వ్యయంతో ఇక్కడ ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా కార్యాచరణ ప్రారంభించారు. రూ.86.50 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తంగా రూ.6,900 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని అప్పట్లో అంచనా వేశారు.

అంతా తారుమారు: 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మల్లవల్లిలో భూ కేటాయింపులపై విజిలెన్స్‌ విచారణ జరపడం, కొన్ని కేటాయింపులను రద్దు చేయడం, వివిధ కారణాలతో పరిశ్రమల స్థాపనలో వేగం తగ్గిపోయింది. అశోక్‌ లేల్యాండ్‌ కూడా యూనిట్‌ని ప్రారంభించలేదు. మరోవైపు గత ప్రభుత్వం ఎకరా రూ.16.50 లక్షల చొప్పున కేటాయించగా, వైకాపా అధికారంలోకి రాగానే రూ.79.60 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఎకరం ధర రూ.89 లక్షలకు చేరింది. ఇంకా 300 ఎకరాల వరకు భూమి ఖాళీగానే ఉండిపోయింది.

మౌలిక వసతుల్లో జాప్యం: అంతర్గత రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసినా, పారిశ్రామికవాడకు రాజమార్గంగా ఉండేలా 3.9 కి.మీ మేర 150 అడుగుల వెడల్పుతో నాలుగేళ్ల కిందట రహదారి నిర్మాణం చేపట్టారు. భూసేకరణ వివాదంతో ఇప్పటికి కానీ ఈ మార్గం అందుబాటులోకి రాలేదు. పారిశ్రామికవాడ అవసరాల నిమిత్తం కృష్ణా నది నుంచే నేరుగా పైపులైను ద్వారా నీరు తీసుకువచ్చే పనులు కొలిక్కి రాలేదు. రెండు విద్యుత్తు ఉపకేంద్రాలు నిర్మించారు. ఇంకా అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగు కాల్వల వ్యవస్థ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.  మౌలిక వసతుల పనులు కూడా వేగవంతం చేశామని ఏపీఐఐసీ జనరల్‌ మేనేజరు శ్రీనివాసరావు చెప్పారు.  త్వరలోనే పారిశ్రామివాడ ఓ రూపు సంతరించుకుంటుందన్నారు..

కీలక సంస్థల డీలా...

అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ 75 ఎకరాల్లో బస్సుల బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ నిర్మించింది. హెరిటేజ్‌, మోహన్‌ స్పింటెక్స్‌ వంటి సంస్థలు తమ యూనిట్లలో ఉత్పత్తి ఆరంభించాయి. జాతీయ రహదారుల సంస్థ లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. రైల్‌నీర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇంకా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తమై, కొన్ని ఉత్పత్తులను ప్రారంభించాయి. కానీ అశోక్‌ లేల్యాండ్‌ మూడేళ్లయినా ప్రారంభించలేదు. రైల్‌నీర్‌ నత్తనడకన జరుగుతున్నాయి. లాజిస్టిక్‌ హబ్‌ ఊసే లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని