logo

రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంప్‌ కృష్ణా

విశాఖలో ఈ నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన 7వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ (అండర్‌-18)బాలబాలికల బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ కైవసం

Published : 29 Jun 2022 04:51 IST


బహుమతితో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖలో ఈ నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన 7వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ (అండర్‌-18)బాలబాలికల బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ కైవసం చేసుకుందని జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్‌సీ బోస్‌, జె.రామచంద్రరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన తుది పోరులో కృష్ణా జట్టు 55-34 స్కోర్‌ తేడాతో అనంతపురం జిల్లా జట్టుపై సునాయాసంగా గెలిచింది.

ఈతలో విద్యార్థి ప్రతిభ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: నగరంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)లో పదో తరగతి చదువుతున్న ఎంఎన్‌ఎస్‌ రోహన్‌ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడని స్కూల్‌ ప్రిన్సిపల్‌ భువన్‌ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు జిల్లా స్విమ్మింగ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహన్‌ గ్రూపు-2 కేటగిరీ బాలుర విభాగంలో 200 మీ బ్రెస్ట్‌ స్ట్రోక్‌ను 3 నిమిషాల, 16.16 సెకన్లలో పూర్తిచేసి తృతీయ స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్కూల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్‌ పరిమి పవన్‌ చంద్‌, డీన్‌ ఎస్‌బీ రావులు.. రోహన్‌ను అభినందించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ సంజయ్‌ భాటియా, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

30న అండర్‌-19 చదరంగ పోటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ది విజయవాడ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన నగరంలోని బర్డ్స్‌ సాంగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాంగణంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్‌-19 బాలబాలికల చదరంగ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అక్బర్‌ పాషా, ఎం.రాజీవ్‌ తెలిపారు. జనవరి ఒకటి, 2003 తర్వాత జన్మించినవారు పోటీలో తలపడేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు సొంత చదరంగ కిట్లతో అదే రోజు ఉదయం 8 గంటల్లోపు హజరవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 90303 08811 నంబరులో సంప్రదించాలని సూచించారు.

జాతీయ జూనియర్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కటక్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే 30వ జాతీయ జూనియర్‌ బాలబాలికల ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తలపడే రాష్ట్ర జట్టును రాష్ట్ర ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్‌ మంగళవారం వెల్లడించారు.

* బాలుర విభాగం: ఫాయల్‌లో డి.రాజు, ఎల్‌.సాయి నిఖిల్‌ రాజ్‌, సీహెచ్‌పీఎల్‌ విష్ణువర్థన్‌ నాయుడు, ఎన్‌.చరణ్‌ తేజ, ఎపీలో జె.వెంకట ధన్వి, కె.సాయి ప్రీతమ్‌, కె.నాగేంద్రనాథ్‌, కె.రోహన్‌, సాబ్రెలో ఎన్‌.వంశీ ప్రదీప్‌ యాదవ్‌, కె.సురుత్‌ సింహ, పి.సాయి తారక్‌ హర్ష, బి.హరి చంద్రప్రసాద్‌. ఈ జట్టుకు కోచ్‌గా బి.అశోక్‌, మేనేజరుగా ఎం.సతీష్‌ నియమితులయ్యారు.

* బాలికల విభాగం: ఫాయల్‌లో జి.అక్షయ, బి.హిమ సాయివర్ష, ఎస్‌.మోబినా, ఎన్‌.రూప నిహారికారెడ్డి, ఎపీలో ఎస్‌.మౌనిక, హెచ్‌ చరణ్య సిరి, వై.ఉమామహేశ్వరి, వై.జ్యోతి, సాబ్రెలో వై.లక్ష్మీ లావణ్య, పి.భావగ్న, పి.గ్రీష్మ, కె.అమూల్య. ఈ జట్టుకు కోచ్‌గా జె.వంశీ, మేనేజరుగా డి.భవాని నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని