logo

మారుతున్న మానవ సంబంధాలు

మారిన సాంకేతిక సమాజంలో డబ్బే ప్రధానమైందని, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని కలెక్టర్‌ డిల్లీరావు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో జిల్లా వృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు.

Published : 02 Oct 2022 04:06 IST

సీనియర్‌ సిటిజన్లను సత్కరిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : మారిన సాంకేతిక సమాజంలో డబ్బే ప్రధానమైందని, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని కలెక్టర్‌ డిల్లీరావు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో జిల్లా వృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో వృద్ధుల ఆస్తులు రాయించుకున్న సమస్యలు అధికంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల జీవితాలు యువతకు స్ఫూర్తిగా ఉంటాయని చెప్పారు. కానీ వృద్ధాప్యంలో తిండి, వైద్యం వంటి వాటికి నోచుకోక.. కొడుకుల చేత గెంటివేతకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా లక్షలాది మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ట్రై సైకిళ్లు వంటివి ఇస్తున్నారని చెప్పారు. గడప గడపకూ వెళుతుంటే వృద్ధుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన వృద్ధుల సంఘం కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2007 కుటుంబ పోషణ చట్టం సక్రమంగా అమలు చేయాలని, ట్రిబ్యునల్‌ త్వరితగతిన తీర్పులు ఇచ్చి వృద్ధులకు సరైన న్యాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమశాఖ జిల్లా సహాయ సంచాలకులు రామ్‌కుమార్‌, విశ్రాంత సహాయ సంచాలకులు ఎ.వి.డి.నారాయణరావు, వృద్ధుల సంఘం అధ్యక్షుడు వేమూరు బాబూరావు, సర్వోదయ ట్రస్ట్‌ అధ్యక్షుడు జి.వి.మోహన్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధుల జాతీయ హెల్ప్‌లైన్‌ 14567 పోస్టరును ఆవిష్కరించి పలువురు సీనియర్‌ సిటిజన్లను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని