logo

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

బీచ్‌లలో రక్షణ ఏర్పాట్లు లేక.. ఏటా సందర్శకులు ప్రాణాలు కోల్పోతున్నారు. బీచ్‌లలో జరిగే ప్రమాదాల్లో ఇటీవల యువత ఎక్కువగా మరణిస్తున్నారు. గత నెల 5న బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 28 Nov 2022 04:04 IST

బీచ్‌లలో సందర్శకుల రక్షణకు చర్యలు అంతంతే
పెరుగుతున్న ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన

విశాఖ ఆర్కే బీచ్‌లో పిల్లలు, పెద్దల సందడి

ఈనాడు, అమరావతి: బీచ్‌లలో రక్షణ ఏర్పాట్లు లేక.. ఏటా సందర్శకులు ప్రాణాలు కోల్పోతున్నారు. బీచ్‌లలో జరిగే ప్రమాదాల్లో ఇటీవల యువత ఎక్కువగా మరణిస్తున్నారు. గత నెల 5న బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. భీమునిపట్నం బీచ్‌లో ఈనెల 18న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకటి, రెండు రోజులు అధికారులు హడావుడి చేసి, ఆపై మిన్నకుంటున్నారు. చాలాచోట్ల గజ ఈతగాళ్లు లేరు.

ప్రమాదాలతో మళ్లీ తెరపైకి..

రాష్ట్రంలో ఎక్కువగా వెళ్లే విశాఖ బీచ్‌లలో రక్షణ చర్యలను గాలికొదిలేశారు. ఆర్కేబీచ్‌, రుషికొండ, యారాడ, భీమునిపట్నం వద్ద నియమించిన 38 మంది గజ ఈతగాళ్లను 2022 ఏప్రిల్‌ నుంచి నిలిపివేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.18వేల చొప్పున చెల్లించేవారు. ప్రజల్లో ఆందోళన వ్యక్తం కావడంతో జీవీఎంసీ అధికారులు గజ ఈతగాళ్లను మళ్లీ నియమించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ఈ ఏడాది అక్టోబరు 5న ఆరుగురు యువకులు మరణించాకే ఈతగాళ్లను నియమించారు.

* మచిలీపట్నం సమీపంలోని మంగినపూడిలో సందర్శకులకు రక్షణ చర్యలు అంతంతే. ఇక్కడ మెరైన్‌, స్థానిక పోలీసులు కలిపి నలుగురు బీచ్‌లో రోజూ విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా కొట్టుకుపోతే మత్స్యకారుల సాయంతో రక్షిస్తారు.

* నెల్లూరు జిల్లాలో మైపాడు, తుమ్మలపెంట బీచుల్లోనూ రక్షణ ఏర్పాట్లు లేవు, గజ ఈతగాళ్లూ లేరు.

* శ్రీకాకుళం జిల్లాలో బారువ, మొగదలపాడు, భావనపాడు, అక్కుపల్లిలలో రక్షణ చర్యలు నామమాత్రమే. విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్‌లోనూ రక్షణ చర్యలు లేవు.

హెచ్చరిక బోర్డులు ఎక్కడ?

బీచ్‌లలో చాలాచోట్ల హెచ్చరిక బోర్డులు లేవు. బీచ్‌ పాయింట్లలో సముద్రం లోతుగా ఉన్న, ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి. విశాఖలోని ఆర్కేబీచ్‌లో ఏర్పాటుచేసిన బోర్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి. భీమునిపట్నం బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యాక మళ్లీ బోర్డులు పెట్టారు.

అటకెక్కిన బీచ్‌ పోలీసుల నియామక ప్రతిపాదన

కొన్ని బీచ్‌లలో మెరైన్‌ పోలీసుస్టేషన్లు ఉన్నా... వీటిలో సిబ్బంది కొరతతో ప్రమాదాలపై దృష్టి సారించలేకపోతున్నారు. సందర్శకుల పర్యవేక్షణ కోసం ముఖ్యప్రాంతాల్లో ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ఎవరైనా కొట్టుకుపోతే రక్షించే పరికరాలు లేవు. ప్రమాదతీవ్రతను బట్టి కోస్ట్‌గాస్ట్‌, నేవీ రంగంలో దిగుతోంది.

* జాతీయ నేరగణాంక సంస్థ నివేదిక ప్రకారం 2019లో ఏపీలో 1,554 మంది సముద్రం, నదులు, కాలువల్లో కొట్టుకుపోయి మృతిచెందారు. 2020లో ఈ సంఖ్య 1,723కు, 2021 నాటికి 1,917కి చేరుకుంది.

* ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రపంచ ఆరోగ్యసంస్థ పలు సూచనలు చేస్తున్నా అవి అమలుకావట్లేదు. చిన్నారులు సముద్రంలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలని, సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మైకుల్లో ప్రచారం చేయాలన్న సూచనలు నివేదికలకే పరిమితమవుతున్నాయి.


అక్టోబరు-జనవరి మధ్యే ఎక్కువ ప్రమాదాలు

- వీఎస్‌ఆర్‌ మూర్తి, విశ్రాంత శాస్త్రవేత్త, జాతీయ సముద్ర అధ్యయన సంస్థ

‘ఉత్తరదిశ నుంచి దక్షిణదిశ వైపు అక్టోబరు-నవంబరు మధ్య వచ్చే అలల తీవ్రత కారణంగా సముద్రంలోకి దిగినవారిలో ఎక్కువ మంది లోపలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుకొచ్చే అలలు తిరిగి వెనక్కి వెళ్లేటప్పుడు చాలామంది కొట్టుకుపోతున్నారు. అలల ఉద్ధృతి, అందులోని రిప్‌ కరెంట్‌లను సాధారణ వ్యక్తులు గమనించలేరు. అదే ప్రమాదాలకు దారితీస్తోంది.’


సందర్శకులను అప్రమత్తం చేయాలి

- బి.బలరాంనాయుడు, అధ్యక్షుడు, రాష్ట్రీయ లైఫ్‌సేవింగ్‌ సొసైటీ ఏపీ చాప్టర్‌

‘బీచ్‌లలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, సందర్శకులు అటు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. ఏపీలో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్న బీచ్‌లలో ప్రమాదాల బారిన పడేవారిని కాపాడే వ్యవస్థ ఉండాలి. ఈతగాళ్లతోనే అన్ని సందర్భాల్లో రక్షించడం సాధ్యం కాదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలి.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని