logo

సీఎం వద్దకు చేరిన పంచాయితీ!

రెండు ఘటనలు.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. ఒకటి ఇసుక అక్రమ రవాణా.. రెండు భౌతిక దాడులు.. రెండు ఘటనలపై పోలీసు కేసులు లేవు. కానీ పంచాయితీ తాడేపల్లికి చేరింది.

Updated : 30 Jan 2023 05:20 IST

ఫిర్యాదు చేసినా కేసులు లేవు
ఈనాడు, అమరావతి

రెండు ఘటనలు.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. ఒకటి ఇసుక అక్రమ రవాణా.. రెండు భౌతిక దాడులు.. రెండు ఘటనలపై పోలీసు కేసులు లేవు. కానీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఇరువర్గాలతో పెద్దలు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయకుండా వేచి చూస్తున్నారు. న్యాయసలహా తీసుకుంటున్నామంటూ నిరీక్షిస్తున్నారు. పెద్దల సూచన మేరకు కేసులు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై ఆఘమేఘాల మీద కేసులు నమోదు చేసి విచారణ పేరుతో అర్ధరాత్రి.. అపరాత్రి అనకుండా ఠాణాకు తీసుకెళ్లే పోలీసులు.. ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఈ రెండు కేసుల తీరుపై జిల్లా వైకాపాలో అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. ఇసుక అక్రమ రవాణా గుట్టును రట్టు చేసింది. తాడేపల్లి పెద్దల వద్దకు చేరిన పంచాయితీ తీర్పుపై వైకాపా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎస్‌ఈబీ ఫిర్యాదు ఇచ్చినా..!

తమ విధులను అడ్డుకోవడమే కాకుండా ఘర్షణకు దిగారంటూ ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ స్వయంగా రాత పూర్వకంగా నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులు గడిచినా ఇంతవరకు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయలేదు. నందిగామ మండలం అంబారుపేట ఇసుక తవ్వకాల కేసు ఎమ్మెల్సీకి, మైలవరం ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. నందిగామ మండల కన్వీనర్‌తో పాటు వైకాపా నాయకులు తమపై దాడికి యత్నించారని, తమ విధులను అడ్డుకున్నారని, తమ వాహనంపై దాడికి దిగారని, ఇసుక తవ్వకాలు జరుపుతాం.. దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించారని సీఐ, ఎస్‌ఐ, హెచ్‌సీలు స్వయంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ బెదిరింపు జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇసుక నింపిన వాహనాలను స్వాధీనం చేసుకోకుండా.. జేసీబీని స్వాధీనం చేసుకోకుండా.. ఇసుకను అన్‌లోడ్‌ చేసి వాహనాలను పంపించేశారు. మరవైపు ఇదే ఘటనపై ఇసుక అధికారిక గుత్త సంస్థ జేపీ వెంచెర్స్‌ తరఫున జిల్లా అధికారి పి.బాబూరావు అదనపు ఎస్పీ (ఎస్‌ఈబీ)కి ఫిర్యాదు చేశారు. ఈ కాపీని పోలీసులకు పంపారు. దీనిపై చర్యలు లేవు. పోలీసులు మాత్రం దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు వైకాపా పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్సీ దీనిపై పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వద్దకు పంచాయితీ చేరింది. ఇరువర్గాలను పిలిచి మాట్లాడి పరిష్కరిద్దామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోసారి మైలవరం ఎమ్మెల్యేను పిలిచి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎస్‌ఈబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతం నుంచి ఇసుక భారీగా అక్రమ రవాణా అవుతున్నట్లు గుత్త సంస్థ ఆరోపిస్తున్నట్లు తెలిసింది.

అవనిగడ్డ వ్యవహారమూ...

మరోవైపు అవనిగడ్డ వ్యవహారం కూడా సీఎం కార్యాలయానికి చేరింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పీఏ శివపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, ఆయన తనయుడు వికాస్‌ భౌతికంగా దాడి చేయడం కలకలం రేపింది. బందరులో ఎంపీ, ఎమ్మెల్యేకు పొసగడం లేదు. తాజాగా అవనిగడ్డ రాజకీయాలు కూడా భిన్నంగా మారాయి. దీనికి కారణాలు ఉన్నట్లు తెలిసింది. ఆధిపత్య పోరులో భాగంగానే ఇక్కడ దాడులు జరిగినట్లు తెలిసింది. గత ఏడాది అవనిగడ్డలో షరతులుగల పట్టాల పంపిణీకి సీఎం వచ్చిన సందర్భంగా ఎంపీ అనుచరుడు శివ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు శివ టిక్కెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ పీఏగా అవనిగడ్డ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారనేది ఎమ్మెల్యే వర్గీయుల ఆరోపణ. ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా పేకాట శిబిరం నిర్వహించారు. దీనిలో ఒక నిందితుడిని పోలీసులు పట్టుకుంటే ఎంపీ వర్గీయులు విడిపించారని తెలిసింది. ఈ విషయం పోలీసులు ఎమ్మెల్యేకు చేరవేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే, ఆయన తనయుడు మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. శనివారం నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్‌ రాక సందర్భంగా ఆయన ముందే భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై నాబార్డు ఛైర్మన్‌ కూడా అసహనం వ్యక్తం చేశారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సహనంతో ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై సీఎంకు సమాచారం ఇవ్వడంతో పిలిచి మాట్లాడతామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే బందరు పంచాయితీలో ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తాజాగా ఈ వ్యవహారం సీఎం వద్దకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని