logo

పోర్టు భూములకు హద్దులు

పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో నిర్దేశిత భూముల్లో ఇటీవల సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పాలకులు చెబుతున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో భూములను సబ్‌డివిజన్‌ చేసి కొత్త సర్వే సంఖ్యలు కేటాయిస్తూ తాజాగా జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ గెజిట్‌ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 04 Feb 2023 03:27 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో నిర్దేశిత భూముల్లో ఇటీవల సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పాలకులు చెబుతున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో భూములను సబ్‌డివిజన్‌ చేసి కొత్త సర్వే సంఖ్యలు కేటాయిస్తూ తాజాగా జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ గెజిట్‌ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నాలుగు గ్రామాలు..1688 ఎకరాలు

పోర్టు నిర్మాణంలో భాగంగా తొలివిడతగా మంగినపూడి, తపశిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం గ్రామాల్లోని సముద్రతీర భూమిని ఇప్పటికే కేటాయించారు. తీర ప్రాంత భూములు కావడంతో వాటికి ఇప్పటివరకు ఎలాంటి సర్వే సంఖ్యలు లేవు. పోర్టు పనులు ప్రారంభించేందుకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఆయా గ్రామాల్లో భూములకు కొత్తగా సర్వే సంఖ్యలు కేటాయించడంతోపాటు ఎంత భూమి ఉందో కూడా నిర్ధారించారు. అలా నాలుగు గ్రామాల్లో 1688  ఎకరాల భూమిలో సర్వే పూర్తిచేసి సంఖ్యలు కేటాయించారు.

వెళ్లే దారేది?

పోర్టు ప్రతిపాదిత భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించడంతోపాటు హద్దులు కూడా నిర్ణయించడంతో అక్కడవరకు ఒక స్పష్టత వచ్చినా పోర్టుకు అనుసంధానించే  రహదారులకు అవసరమైన  భూసేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రోడ్డు, రైలుమార్గం అనుసంధానానికి 235 ఎకరాల వరకు అవసరం అవుతుందని అధికారులు ప్రతిపాదించారు.బందరు మండలంలోని పోతేపల్లి, కరగ్రహారం, అరిశేపల్లి, మేకవానిపాలెం, మాచవరం ప్రాంతాల్లో ఆ భూమిని సేకరించాలని నిర్ణయించి సర్వే కూడా పూర్తి చేశారు.సేకరించాల్సిన భూమిలో 183.94 ఎకరాలు పట్టాభూమి, అసైన్డ్‌ భూమి 26.88 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12.50 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాభూమిలో ఇప్పటికే 48 ఎకరాలకుపైగా సేకరించిన భూమి ఉండగా  మిగిలింది కొనుగోలు  చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ.133కోట్లవరకు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఇదిగో రూ.100కోట్లు కేటాయిస్తున్నామని గతేడాది ఏపీ మారిటైంబోర్డు సీఈవో ప్రకటించారు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ పాలకులు, పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రకటనలు చేస్తున్నారు తప్ప నిధులు మాత్రం విడుదల కావడం లేదు. నిధులు విడుదలైతేనే ఈ భూమి సేకరణ జరగని పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని