logo

గతం కంటే కాస్త ఊరట

కేంద్ర బడ్జెట్‌లో విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు గతం కంటే ఈసారి కాస్త ఊరట కలిగింది. గూడూరు-విజయవాడ మూడోలైన్‌ సహా కొన్ని ప్రాజక్టులకు ఆశాజనకంగానే కేటాయింపులు చేశారు.

Published : 04 Feb 2023 03:27 IST

గూడూరు-విజయవాడ మూడోలైన్‌కు రూ.800కోట్లు
అమరావతి సహా ఇతర ప్రాజెక్టులకు మళ్లీ నిరాశ
ఈనాడు, అమరావతి

కేంద్ర బడ్జెట్‌లో విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు గతం కంటే ఈసారి కాస్త ఊరట కలిగింది. గూడూరు-విజయవాడ మూడోలైన్‌ సహా కొన్ని ప్రాజక్టులకు ఆశాజనకంగానే కేటాయింపులు చేశారు. కానీ.. అమరావతి నూతన రైల్వేలైన్‌ లాంటి కీలకమైన ప్రాజెక్టులకు మాత్రం నామమాత్ర విధిలింపులతో సరిపెట్టారు.

విజయవాడ డివిజన్‌ పరిధిలోని గూడురు-విజయవాడ మూడోలైన్‌కు రూ.800 కోట్లు తాజా బడ్జెట్‌లో కేటాయించారు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. 2015-16లో 288కిలోమీటర్ల పొడవైన ఈ లైన్‌ మంజూరైంది. ప్రస్తుతం పనులు మధ్యలో ఉన్నాయి. మిగతా పనులను పూర్తిచేసేందుకు తాజా బడ్జెట్‌లో బాగానే కేటాయింపులు చేశారు. విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మధ్యలో వచ్చే ఈ మూడో లైన్‌ పూర్తయితే.. సరకు రవాణా రైళ్లను దీనిపైకి మళ్లించేయొచ్చు. దీనివల్ల ప్రధాన లైన్‌పై వీటి తాకిడి తగ్గుతుంది. విజయవాడ-కాజీపేట మూడోలైన్‌, విద్యుదీకరణకు కూడా రూ.337 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. కానీ.. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. విజయవాడ నుంచి చెరువుమాధవరం వరకూ డివిజన్‌ పరిధిలోని లైన్‌ పూర్తయిపోయింది. అక్కడి నుంచి కాజీపేట వరకూ మిగతా పనులు పూర్తిచేయాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో ఆ పనులు వేగవంతమవుతాయి. విజయవాడ, కాజీపేట బైపాస్‌ లైన్లకు రూ.310 కోట్లను కేటాయించారు.  విజయవాడకు 20కిలోమీటర్లు, కాజీపేటకు 11కిలోమీటర్ల లైన్‌ కోసం ఈ నిధులు కేటాయించారు.

కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్తలైన్‌ పూర్తయితే..

కాకినాడ నుంచి విజయవాడకు వచ్చేందుకు కీలకమైన ప్రాజెక్టు కోటిపల్లి-నర్సాపూర్‌ నూతన లైన్‌. దీనికి తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించడం శుభపరిణామం. విజయవాడ-దువ్వాడ ప్రధాన రైల్వే లైన్‌తో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయమార్గంగా ఇది మారబోతోంది. కాకినాడ నుంచి కోటిపల్లికి ఇప్పటికే ఒక పాత లైన్‌ ఉంది. ఈ లైన్‌ను కలుపుతూ కోటిపల్లి నుంచి నర్సాపూర్‌కు కొత్త లైన్‌ వేస్తున్నారు. ఇది పూర్తయితే.. కాకినాడ నుంచి ఈ ప్రత్యామ్నాయ మార్గంలో విజయవాడకు చేరుకోవచ్చు. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నర్సాపూర్‌, భీమవరం, గుడివాడ, విజయవాడకు వచ్చేయొచ్చు. విజయవాడ-దువ్వాడ ప్రధాన మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. నర్సాపూర్‌-భీమవరం-మచిలీపట్నం, గుడివాడ, నిడదవోలు బ్రాంచ్‌లైన్‌ డబ్లింగ్‌కు రూ.100 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించారు.

స్టేషన్ల అభివృద్ధి నిధుల్లో రాబట్టొచ్చు..

రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనుల కోసం రూ.555 కోట్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు చేశారు. కీలకమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించాలని సూచించారు. ఇవికాకుండా మరో రూ.215 కోట్లను రైల్వేస్టేషన్ల అభివృద్ధికోసం ఇచ్చారు. ఈ రెండు కోటాల్లో విజయవాడ డివిజన్‌లోని ప్రధాన స్టేషన్ల ఆధునికీకరణ, అభివృద్ధి కోసం ఎక్కువ నిధులను రాబడితే కొంత ఉపశమనం ఉంటుంది. విజయవాడ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్డు అభివృద్ధి కోసం రూ.3 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.


అమరావతి ప్రాజెక్టుకు మళ్లీ నిరాశ..

విజయవాడ నుంచి గుంటూరుకు వయా అమరావతి మీదుగా వెళ్లే కొత్త లైన్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కేవలం రూ. రూ.10 లక్షలు ఇచ్చారు. అమరావతి రాజధానిని రెండు ప్రధాన నగరాలకు అనుసంధానించే ఈ కీలక ప్రాజెక్టు విషయంలో ప్రతి బడ్జెట్‌లోనూ నిరాశే ఎదురవుతోంది. 106కిలోమీటర్ల పొడవుతో రూ.2800 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని ప్రతిపాదించిన ఈ లైన్‌ విషయంలో 2017 నుంచి కేంద్రం మొండిచేయి చూపిస్తూనే ఉంది. దీనికితోడు విజయవాడ డివిజన్‌ పరిధిలోని కీలకమైన పిఠాపురం-కాకినాడ, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం లైన్లకు కేవలం రూ.వెయ్యి చొప్పున బడ్జెట్‌ ఇవ్వడం నిరాశ కలిగించింది. పిఠాపురం-కాకినాడ లైన్‌ పూర్తయితే.. దువ్వాడ-అన్నవరం-పిఠాపురం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో విజయవాడకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. గూడురు-దుగ్గరాజపట్నం లైన్‌కు కూడా కేవలం రూ.10లక్షలు ఇచ్చి వదిలేశారు. దువ్వాడ-విజయవాడ మూడోలైన్‌కు కూడా కేవలం రూ.10లక్షలు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని