logo

Vijayawada: ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి పేరుతో అత్యాచారం

ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశాడు.

Updated : 17 Feb 2023 08:08 IST

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై సూర్యారావుపేట పోలీసులు బుధవారం రాత్రి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సంఘటన గుంటూరులో జరిగినా బాధితురాలు సూర్యారావుపేటలో పనిచేస్తుండటంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన యువతి (22) కొద్దికాలం కిందట విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసింది. 2019లో ఆమెకు ఎం.రమేష్‌బాబు అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ప్రేమించానంటూ ఆమె వెంట తిరిగాడు. అయితే యువతి వేరే యువకుడిని వివాహం చేసుకుంది. తరువాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అనంతరం ఆమె సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో రమేష్‌బాబు మళ్లీ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

గత నెల 14న గుంటూరు బస్టాండ్‌ సమీపంలోని తనకు తెలిసిన వారింటికి యువతిని రమేష్‌బాబు తీసుకెళ్లాడు. తాము దంపతులమని చెప్పి రెండు రోజులు వారింట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరూ పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యారు. జనవరి 16న యువతిని విజయవాడలో వదిలేశాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తరువాత సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువతి ఉండటంతో అక్కడే కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని