logo

ప్రాణం తీసిన ఈత సరదా

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.

Published : 18 Apr 2024 04:57 IST

కాలువలో మునిగి ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

మేడికొండూరు, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్ల కిందట కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు కార్తిక్‌(20) గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని ఒక కళాశాల వసతిగృహంలో ఉంటూ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం శ్రీరామ నవమి కావడంతో కళాశాలకు సెలవు ప్రకటించారు. పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్తున్నామని చెప్పి కార్తిక్‌, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి కళాశాల నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండారుపల్లి మేజర్‌ కాలవ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో  కార్తిక్‌ ఈత కొట్టేందుకు కాలువ గట్టుపై నుంచి కాలువలోకి దూకాడు. తొలుత రెండుసార్లు దూకి పైకి వచ్చిన అతడు.. మూడోసారి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్నేహితులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జయ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో కాలువలో సుమారు నాలుగు గంటల పాటు జల్లెడ పట్టారు. ఘటనా స్థలికి కిలో మీటరు దూరంలో కార్తిక్‌ మృతదేహాన్ని గుర్తించారు. అతడి తల భాగం వద్ద రక్తపు గాయం ఉంది. ఈతకు దూకిన క్రమంలో నేలకు తగిలి గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో మహిళ ..

గూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...తోట్లవల్లూరు మండల పరిధిలోని గరికపర్రు నుంచి బోలెం నాగమల్లేశ్వరరావు, శివకుమారి దంపతులు ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వచ్చేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో గూడూరు వద్ద విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న కారు బైక్‌ను ఢీకొంది. దీంతో శివకుమారి(55) అక్కడికక్కడే మృతిచెందగా గాయాలపాలైన ఆమె భర్తను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా స్వల్పగాయాలయ్యాయి. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.


అనుమానాస్పద స్థితిలో యువకుడు..

కొండపల్లి: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కొండపల్లి పారిశ్రామికవాడ లాడ్జిలో బుధవారం చోటుచేసుకొంది. సీఐ సత్యనారాయణ వివరాలు ప్రకారం.. కృష్ణా జిల్లా పెడన ఉరిమి గ్రామానికి చెందిన ఎ.పవన్‌ (27) స్థానిక ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. పరిశ్రమల సమీపంలోని ఓ లాడ్జిలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం ఉదయం లాడ్జి గదిలో పవన్‌ అచేతనంగా పడిఉండటం చూసిన నిర్వాహకులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గదిలో యువకుడు వాంతులు చేసుకొని ఉండటంతో అనారోగ్య కారణాలే మృతికి కారణమని భావిస్తున్నారు.


ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలలో విద్యార్థినిపై అక్కడి ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాలిక తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయినిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థుల ఫీజు విషయంలో ఆ పాఠశాల ఉపాధ్యాయినిలపై సదరు తండ్రి అసభ్యంగా మాట్లాడాడంటూ వారం క్రితం కేసు నమోదవడం గమనార్హం.


ఎన్టీటీపీఎస్‌ కాల్వలో పడి వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఎన్టీటీపీఎస్‌కు వెళ్లే చన్నీళ్ల కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకొంది. మృతునికి 40-45 వయసు, 5.5 అడుగుల ఎత్తు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్నానానికి కాలువలో దిగి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండడని భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు విజయవాడ తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.


ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ దగ్ధం

సీతారాంపురం, న్యూస్‌టుడే: స్థానిక 25వ డివిజన్‌ దుర్గా అగ్రహారంలోని నంబూరివారి వీధిలో నివసించే ఎస్‌.పవన్‌కుమార్‌కు చెందిన ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ నుంచి మంటలు వ్యాపించి కాలిపోయింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం పవన్‌కుమార్‌ ఇంటి బయట ఛార్జింగ్‌ పెట్టారు. పది నిమిషాలకే పొగలు వచ్చి, మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దంతో కాలిపోయిందని ఆయన తెలిపారు. స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పేశారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని