logo

నకిలీ మద్యం.. తాగితే ప్రాణాంతకం

నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Published : 09 May 2024 04:03 IST

బానిసైతే కుటుంబాలు ఛిద్రం
ఎన్నికల వేళ అప్రమత్తత అవసరం

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలో అత్యధికశాతం మంది చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపలవేట, చేనేతతో పాటు అసంఘటిత రంగాల ద్వారా రమారమి రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. చేసిన కష్టం నుంచి ఉపశమనం లభిస్తుందన్న అపోహతో మద్యానికి అలవాటు పడిన వారికి ఆ వ్యసనమే మరణశాసనంగా మారుతోంది. నాణ్యతతో కూడిన ఆల్కహాల్‌ను పరిమితంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక ప్రమాదం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నా, బహిరంగ మార్కెట్‌లో దొరికే నాసిరకం మద్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

తీరప్రాంత వాసుల్లో కలవరం

కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం మండలాల పరిధిలో ఎక్కువగా తీరప్రాంత గ్రామాలున్నాయి. మత్స్యకారుల్లో 90 శాతానికి పైబడి మద్యం అలవాటు ఉన్న వారే. నాసిరకం మద్యం కారణంగా శరవేగంగా ఆరోగ్యం పాడై చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కల్గించే స్థాయికి చేరుకుంటోంది. సంభవిస్తున్న మరణాల్లో ఆరుశాతం వరకూ మద్యం కారణంగా తలెత్తిన వ్యాధుల వల్లే అనేది స్పష్టంగా కన్పిస్తోంది. పెడనలో కేవలం మద్యం కారణంగా ఇటీవల కాలంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడడం గమనార్హం. మద్యం కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల కాలంలోనే చిన్నాపురం, పీటీపాలెం, పీతలావ, తదితర గ్రామాల పరిధిలో కొందరు బలవన్మరణాలకు గురయ్యారు. నాసిరకం మద్యాన్ని నియంత్రించే చర్యలు లేకపోవడం పట్ల ముఖ్యంగా తీరప్రాంత వాసుల్లో కలవరం వ్యక్తమవుతోంది.

ఎన్నికÛల వేళ అప్రమత్తం

ఎన్నికల నేపథ్యంలో గ్రామగ్రామాన కన్పిస్తున్న గోవా బ్రాండ్‌ల పేరుతో కన్పిస్తున్న మద్యం సీసాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల ద్వారా జిల్లా వ్యాప్తంగా గోవా బ్రాండ్‌ పేరుతో సరఫరా చేసినట్టుగా భావిస్తున్న మద్యం స్థానికంగానే తయారుచేశారన్న ప్రచారం ఉంది. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లోనూ హల్‌చల్‌ చేసింది. గన్నవరంలో భారీగా పోలీసులకు పట్టుబడిన మద్యం కూడా వారు సరఫరా చేసిందే అన్న దిశగా దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం.

పత్తాలేని ఈఎన్‌ఏ నిబంధన

గతంలో శుద్ధి చేసిన ఎక్స్‌ట్రాక్టెడ్‌ న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ)తో తయారు చేసిన మద్యం మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఈఎన్‌ఏతో పనిలేకుండా ఇష్టానుసారం వివిధ బ్రాండ్‌ల రూపంలో వస్తున్న మద్యంపై తీవ్ర విమర్శలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో లాభాపేక్షతో మత్తు కోసం ఆరోగ్యానికి హానికరమైన కొన్ని రసాయనాలు కలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

రోజూ రూ.కోటికి తగ్గకుండా వ్యాపారం

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలోని బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా రోజూ కోటి రూపాయలకు తగ్గకుండా మద్యం వ్యాపారం సాగుతోంది. ఇందులో 60 శాతం వాటా కేవలం రెక్కల కష్టం చేసుకునే వారిదే కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సీసాకు నిర్ణయించిన ధరకన్నా రూ.50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యసనం పట్ల కాస్తోకూసో నియంత్రణ ఉన్న వారు సగటున రోజుకు రూ.400 వరకూ మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. పనులు లేని రోజుల్లో అప్పులు చేస్తూ కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు.

ఎక్కడికి వెళ్లారో తెలియదు

ఏసోబు, కోన

ఇంటిల్లపాదీ కష్టం చేసుకుంటూ దర్జాగా బతికే నా సోదరుడు మద్యం వ్యసనంతో వలస వెళ్లిపోవాల్సి వచ్చింది. తాగుడు కోసం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అప్పుల పాలయ్యారు. వైద్యం కోసం తెచ్చిన అప్పులతో ఆరోగ్యం చేకూరకపోగా ఆ భారం పెరిగిపోయింది. దీంతో మూడో కంటికి తెలియకుండా కుటుంబంతో ఎటో వెళ్లిపోయారు.

మగదిక్కు లేకుండా పోయింది

తాగుడు కారణంగా ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది. నాభర్త  మద్యం తాగడంతో నరాలు చచ్చుబడి రెండేళ్ల పాటు మంచానికే పరిమితమై చచ్చిపోయాడు. ఇది జరిగిన ఏడాదికే నాకొడుకు మద్యానికి బానిసై అర్ధంతరంగా మరణించాడు. పింఛను మీద ఆధారపడి బతుకు వెళ్లదీయాల్సి వస్తోంది.

సువార్తమ్మ, పెదతుమ్మిడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని