logo

సంపద సృష్టిస్తాం... ప్రజలకే అందిస్తాం

రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 09 May 2024 04:10 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని, పక్కన కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రల విజయాన్ని కాంకిస్తూ బుధవారం చిన్నాపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కొల్లుతో పాటు దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగునీరు ఇవ్వలేని దుస్థితి పునరావృతం కానీయకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. తెదేపా ప్రకటించిన సూపర్‌-6 పథకాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అపూర్వమన్నారు. మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులైన  ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందుతాయన్నారు. కూటమి అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. కొల్లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఐదేళ్ల పాటు తన వ్యక్తిగత ఎదుగుదల, కొడుకు కిట్టూకు అధికారం కట్టబెట్టాలన్న తాపత్రయం మినహా ప్రజల కోసం చేసింది శూన్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో తగురీతిన బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), కాగిత గోపాలరావు , జనసేన ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, గళ్లా తిమోతి, తదితరుల నేతృత్వాన చిన్నాపురం, నెలకుర్రు తదితర గ్రామాల్లో సాగిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి.. అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలకు కాపలాదారు కావాలా... గంజాయి బ్యాచ్‌కు కొమ్ముకాసే వారు కావాలో విజ్ఞులైన ఓటర్లు ఆలోచించి ఓటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని