logo

వంశీకి ఓటేస్తే.. మహిళలను అవమానించినట్లే: పవన్‌

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్‌లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి.

Updated : 09 May 2024 05:45 IST

జంక్షన్‌లో... జనసేనానికి జన నీరాజనం
మండుటెండను లెక్కచేయని అభిమానులు

జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి - హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్‌లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి. మిట్టమధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నా.. లెక్కచేయకుండా జనసేనాని కోసం శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూశాయి. జంక్షన్‌లో దారులన్నీ.. కూటమి శ్రేణులతో కిక్కిరిశాయి. సభావేదిక వద్ద ఇసుక వేస్తే రాలనంత మంది జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు సభ ప్రారంభమైనప్పటి నుంచి పవన్‌ ప్రసంగం ముగిసే వరకూ.. అలాగే జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారిపై సభా వేదిక వద్ద నిలబడి.. ప్రతి మాటకూ చప్పట్లు, ఈలలతో మోతమోగించారు. ఎన్డీయే కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం, పెనమలూరు, దెందులూరు, నూజివీడు అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్‌, చింతమనేని ప్రభాకర్‌, కొలుసు పార్థసారథి, తెదేపా, జనసేన జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, బండ్రెడ్డి రామకృష్ణ, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌ తదితరులు హాజరయ్యారు.

అతను.. సంస్కారం లేని వ్యక్తి..

గన్నవరం నుంచి వైకాపా తరఫున పోటీ చేస్తున్న వంశీ లాంటి వారికి అసలు ఓట్లు వేయొద్దని పవన్‌ సూచించారు. ‘నేతల మధ్య రాజకీయ పరమైన విభేదాలుండొచ్చు. పార్టీల పరంగా విమర్శలు చేసుకోవచ్చు. కానీ.. నాకెంతో ఇష్టమైన మహనీయులైన ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిని కించపరిచే మాటలు వంశీ మాట్లాడటం అసలు సరికాదు. ఆమె నా సోదరితో సమానం. ఒక మహిళపై ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి. ఒకవేళ వేస్తే.. స్త్రీలను అగౌరవపరిచిన మనస్తత్వం ఉన్న వ్యక్తికి మద్దతు ఇచ్చినట్లే. మన సోదరిని అగౌరవపరిచిన వ్యక్తికి మనం ఓటేసినట్లే. అలాంటి నైజం ఉన్న వాళ్లు.. ఏ ఆడవాళ్లనైనా అలాగే అగౌరవపరుస్తారు. సంస్కారం లేని వంశీ లాంటి వాళ్లకు ఓట్లేయొద్దని.. జనసేన శ్రేణులు, వీరమహిళలకు నా విజ్ఞప్తి’ అని పవన్‌ అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులతో కలిసి ఐక్యత చాటుతున్న పవన్‌కల్యాణ్‌

బాలశౌరి, యార్లగడ్డను గెలిపించండి.. మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో కూటమి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీచేస్తున్న వల్లభనేని బాలశౌరి, గన్నవరం అసెంబ్లీలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావును మంచి మెజార్టీతో గెలిపించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు. వంశీ లాంటి వాళ్లు జనసేన శ్రేణులను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీగా ఓటు బాలశౌరికి వేసి.. ఎమ్మెల్యేగా తనకు వేయమని వంశీ అడుగుతున్నారని తెలిసిందన్నారు. కానీ.. అలాంటి వారి మాటలు వినొద్దని పవన్‌ సూచించారు. సంస్కారవంతుడు, ప్రజలకు అండగా నిలిచే యార్లగడ్డ వెంకట్రావుకే జనసైనికులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 

మల్లవల్లి, విమానాశ్రయ రైతులకు న్యాయం..  మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయ విస్తరణతో భూములు కోల్పోయిన రైతుల ఆవేదన తనకు తెలుసనీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని పవన్‌ భరోసా ఇచ్చారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు నెలకొల్పేలా కార్యాచరణ చేపట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

సంపద సృష్టించి.. సంక్షేమం అమలు చేస్తాం..

బాలశౌరి, ఎన్డీయే కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి

వైకాపా ప్రభుత్వానికి సంపద సృష్టి తెలియదు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారు. మల్లవల్లి వంటి పారిశ్రామికవాడలను ఆపేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదిది. పవన్‌ తను సంపాదన నుంచి రూ.30 కోట్లు కౌలు రైతులకు ఇచ్చారు. నాయకుడంటే అలా ఉండాలి. కృష్ణాలో తాగు, సాగు నీళ్లు లేవు. పోలవరం పూర్తవ్వాలంటే.. కూటమి గెలవాలి. మచిలీపట్నం లోక్‌సభను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా అభివృద్ధి చేస్తాం. బందరు పోర్టును సాకారం చేసి, విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తాను. సంపద సృష్టించి, సంక్షేమాన్ని అమలు చేస్తాం.

గన్నవరంలో గెలుపుతోనే వారికి సమాధానం

యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థి

వైకాపాలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఇక వద్దనుకుని బయటకొచ్చేశాను. గన్నవరంలో ఓడిపోతే.. అమెరికాకు వెళ్లిపోతానని దుష్ప్రచారం చేశారు. కానీ.. గత ఏడేళ్లుగా వెళ్లిపోయానా.. ఇక్కడే ఉన్నాను. ఎన్టీఆర్‌ బిడ్డ భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోం. అసెంబ్లీలో ఒక మహిళ గురించి దిగజారి మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ కూడా చూస్తూ కళ్లుండీ.. ధృతరాష్ట్రుడిలా ఉండిపోయారు. మౌనం అర్ధాంగీకారంలా.. తన మంత్రులకు సీఎం మద్దతు ఇచ్చారు. బాంబులతో దాడిచేసినా చలించని.. చంద్రబాబుతో కన్నీరు పెట్టించినందుకు.. నా విజయంతో సమాధానం చెబుదాం. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పవన్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెదేపా శ్రేణులకు నైతికంగా ఎంతో అండగా నిలిచారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న జనసేనాని మద్దతుతో కూటమి గెలవబోతోంది.

చింతమనేనిపై ఆసక్తికర వ్యాఖ్యలు.. దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్‌ సూచించారు. ఈ సందర్భంగా చింతమనేని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఇద్దరి మైత్రి గొడవతో ఆరంభమైంది. చింతమనేని అంటే నాకు చాలా ఇష్టం. నేను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే గెలిపించే బాధ్యత తనదని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు.’ అని పవన్‌ అనడంతో సభలోని వారంతా ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌, నూజివీడులో పార్థసారథిని మంచి మెజార్టీతో గెలిపించాలనీ, జనసేన మద్దతుదారులంతా అండగా ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని