logo

హత్య కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు

అనంతపురంలో ఓ వ్యక్తి హత్య కుట్రను నాలుగో పట్టణ పోలీసులు భగ్నం చేశారు. తలారి నాగరాజు, మందల గంగాధర్‌, అంపపాతి సురేష్‌ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు వేటకొడవళ్లు,

Updated : 28 Jun 2022 05:49 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్‌హుస్సేన్‌, తదితరులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురంలో ఓ వ్యక్తి హత్య కుట్రను నాలుగో పట్టణ పోలీసులు భగ్నం చేశారు. తలారి నాగరాజు, మందల గంగాధర్‌, అంపపాతి సురేష్‌ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు వేటకొడవళ్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. నగరంలోని కమ్మభవన్‌ సమీపంలో జ్యోతి అనే మహిళ నివాసముంటున్నారు. ఈమె కుమారుడు ధనరాజ్‌ను 2016 మార్చి 28న అనంతపురానికి చెందిన వంశీరెడ్డి హత్య చేశాడు. కుమారుడ్ని చంపిన వంశీరెడ్డిపై జ్యోతి పగ పెంచుకున్నారు. అతన్ని హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలో 2020లో ధర్మవరంలో ఉన్న తన అక్క నాగరత్న గృహ ప్రవేశానికి వెళ్లినప్పుడు అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లికి చెందిన తలారి నాగరాజు అలియాస్‌ రాజు పరిచయమయ్యాడు. వంశీరెడ్డిని చంపాలని రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.2లక్షలు అడ్వాన్సుగా ముట్టజెప్పి, వంశీరెడ్డి ఫొటో, అతని ఇల్లు చూపించారు. ఈ క్రమంలో రాజుకు తెలిసిన ధర్మవరంలోని శాంతినగర్‌కు చెందిన మందల గంగాధర్‌ అలియాస్‌ మెంటల్‌ గంగాధర్‌, ధర్మవరంలోని కేశవనగర్‌కు చెందిన అంపపాతి సురేష్‌ అలియాస్‌ కుంటోడిని వెంటబెట్టుకుని.. సోమవారం ఉదయం వంశీరెడ్డి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లేటపుడు వేటకొడవళ్లతో చంపడానికి శ్రీనగర్‌ కాలనీలోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్లే దారిలో వేచి ఉన్నారు. పోలీసులకు అందిన సమాచారంతో నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. జ్యోతి అరెస్టు కావాల్సి ఉంది. హత్యకుట్ర భగ్నంలో కృషి చేసిన సీఐ జాకీర్‌హుస్సేన్‌, ఎస్సై జమాల్‌బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని