logo

చేదోడు కొందరికేనా..?

అనంతపురం నగరంలోని రజకనగర్‌లోని ఒకే సచివాలయంలోనే 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువమంది లబ్ధిదారులు ఉన్నారు.

Published : 27 Jan 2023 04:33 IST

పెండింగ్‌లో వేల దరఖాస్తులు
అర్హులకు మొండిచేయి

అనంతపురం నగరంలోని రజకనగర్‌లోని ఒకే సచివాలయంలోనే 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువమంది లబ్ధిదారులు ఉన్నారు. గురువారం సెలవు రోజైనా సచివాలయ సిబ్బంది వివరాలు అనుసంధానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివరాలు అనుసంధానం చేసినా కేవలం 40 మంది లబ్ధిదారుల వివరాలు నమోదు చేశారు. ఇంకా 160 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. అక్టోబరులో వరదలు రావడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు లబ్ధిదారుల ధ్రువపత్రాలు తడిసిపోవడంతో కొత్తవి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదలు వచ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువగా రజకులు ఉన్నారు. రజకనగర్‌, గౌరవ గార్డెన్‌, ఇంద్రానగర్‌, మాతంగినగర్‌ ప్రాంతాల్లో ఇబ్బందిగా మారింది.

న్యూస్‌టుడే-అనంత సంక్షేమం

వైఎస్సాఆర్‌ చేదోడు పథకం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. సాయం అందించేందుకు దరఖాస్తుల గడువు ముగిసింది. సవా లక్ష ధ్రువపత్రాలు అందివ్వాలంటూ సాయం ఎగ్గొట్టేందుకు హడావుడిగా షెడ్యూల్‌ ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.  కేవలం మూడ్రోజులు మాత్రమే గడువు ఇచ్చి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందివ్వాలని చెప్పడంతో తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇచ్చింది మూడు రోజులు.. అదీ సెలవు రోజు ఆఖరి గడువుగా నిర్ణయించడంతో అధికారులు అందుబాటులో లేక వేలసంఖ్యలో దరఖాస్తులు నమోదుకు నోచుకోలేదు. ఈ పథకం కింద దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు మూడో విడత సాయం అందివ్వాలని సంక్షేమ క్యాలెండరులో ప్రకటించారు. ఈనెల 30న మూడో విడత సాయం అందివ్వాలని నిర్ణయించినట్లు అధికారులకు సమాచారం అందించారు.

 సర్వర్‌ మొరాయింపు

గతంలో లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రం (లేబర్‌ సర్టిఫికెట్‌) మీసేవ ద్వారా ఉండేది. తాజాగా కేవలం సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే తహసీల్దార్లు ఇతరత్రా పనుల్లో ఉండటంతో తీసుకొని రాలేకపోయారు. చూపిస్తున్నారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం చేదోడు షెడ్యూల్‌ ఇచ్చారు. కులం, లేబర్‌, ఆదాయం, బ్యాంకు పాసుపుస్తం, రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, ఫొటోను లబ్ధిదారుడు ఏప్రాంతంలో ఉంటే అక్కడే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను గురువారం సాయంత్రం లోగా అనుసంధానం చేయాల్సి ఉండేది. సర్వర్‌ మొరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు.


నేటి మధ్యాహ్నం వరకు గడువు

గురువారం చేదోడు వివరాల నమోదు చేస్తున్న సచివాలయ సిబ్బంది

ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా దరఖాస్తులు పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి. గురువారం సాయంత్రం నుంచి సర్వర్‌ పనిచేయడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు గడువు పెంచుతున్నట్లు గురువారం రాత్రి సమాచారం ఇచ్చారు. కేవలం కొన్ని గంటల్లోనే ఇన్ని వేల దరఖాస్తులు ఎలా పరిశీలించి అనుసంధానం చేస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇంకా పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందజేయనివారి పరిస్థితి ఇబ్బందికరమే. గంట గంటకు పరిశీలన ప్రక్రియ చేస్తున్నారని, శుక్రవారం వరకు గడువు పెంచడంతో ప్రక్రియ పూర్తి చేస్తామని బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగముణి తెలిపారు.


ప్రాంతం మారితే ఇక్కట్లే

లబ్ధిదారులు ఇళ్లు మారినా, దుకాణం మరోచోటకు మార్పు చేసుకొన్నా ఇక్కట్లు తప్పడం లేదు. వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండుసార్లు లబ్ధిపొందడంతో గతంలో ఉన్న సచివాలయం వద్దకు వెళితే మీరు మరో ప్రాంతానికి వెళ్లాలని చెబుతుండటంతో వివరాలు సకాలంలో అందివ్వలేకపోతున్నారు. మారినవారు వేరే సచివాలయంలోకి వెళ్లాలని చెబుతున్నారు. సచివాలయంలో కొత్తగా దరఖాస్తు చేసుకోమంటున్నారు. రెన్యువల్‌ కాకపోవడంతో సచివాలయ సిబ్బంది మరో ప్రాంతానికి వెళ్లాలని సూచిస్తున్నారు.

దిక్కుతోచడం లేదు

రెన్యూవల్‌ చేయించుకోవాలని బుధవారం చెప్పారు. కుల, ఆదాయ, ఫొటోలు, లేబర్‌ సర్టిఫికెట్‌ కావాలంటున్నారు. లేబర్‌ సర్టిఫికెట్‌ మీసేవా కేంద్రంలో ఇవ్వలేదు. సచివాలయం వద్దకు గురువారం వెళితే ఈ సచివాలయంలో చేయంటున్నారు. వేరే సచివాలయంలోకి వెళ్లాలంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. గడువు పెంచాలి.

- కవిత, రజకనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు