logo

నిలదీస్తున్నారు.. తిరగలేం!

క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. గ్రామాలకు వెళ్తే సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి ఉంది.. అని పలువురు ప్రజాప్రతినిధులు దిశా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2023 05:16 IST

దిశా సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆవేదన

సమావేశంలో మాట్లాడుతున్న దిశా ఛైర్మన్‌, ఎంపీ రంగయ్య, చిత్రంలో కలెక్టర్‌ గౌతమి, కాపు రామచంద్రారెడ్డి

లక్ష్మీనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. గ్రామాలకు వెళ్తే సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి ఉంది.. అని పలువురు ప్రజాప్రతినిధులు దిశా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా పరిషత్తు కార్యాలయం డీపీఆర్‌సీ సమావేశ భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు, దిశా ఛైర్మన్‌ రంగయ్య, దిశా కమిటీ మెంబర్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్‌ గౌతమి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్యెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్‌ పర్సన్‌ గిరిజమ్మ, ఎంపీపీలు పలు సమస్యలను లేవనెత్తారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎహసాన్‌బాషాను ప్రశ్నించారు. మండలానికి ఒక ఆర్‌వో ప్లాంట్‌ పెట్టాలని ప్రతిపాదిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఆర్‌వో ప్లాంట్‌ పెడితే గ్రామాల్లో ఉండే ప్రజలు మండల కేంద్రానికి వచ్చి నీళ్లు తీసుకెళ్లాలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీకొకటి చొప్పున ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పథకాలకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారులు ముందుకు రావటం లేదని ఎస్‌ఈ వివరించారు. పీఏంఏవై కింద ఒక్కో నియోజకవర్గానికి ఒకలా ఇళ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇళ్లు కేటాయించారని మరో నియోజకవర్గంలో తక్కువ సంఖ్యలో కేటాయించారని ఇలా ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ఇళ్లు కేటాయించాలని ప్రజలు అడుగుతున్నారని హౌసింగ్‌ అధికారులే వారికి సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అనంతరం డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డిని ఉపాధి పనిదినాలు 100 రోజులు ఎందుకు కల్పించటం లేదని అడిగారు. పనులు కల్పించకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వ ఇచ్చే నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. పీడీ మాట్లాడుతూ.. ఉపాధి పనులకు సంబంధించి కేంద్రం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తోందని కొన్ని సమస్యలు తలెత్తటంతో వివరాలు నమోదు చేయలేకపోయామన్నారు. ఉపాధిలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉండగా ఎంతమంది ఇస్తున్నారో వివరాలను సేకరించి అందజేయాలన్నారు.

సమావేశ భవనానికి ఉన్న విద్యుత్తు వైరింగ్‌ను సక్రమంగా ఏర్పాటు లేక ఏసీలు పనిచేయలేదు. అధికారులు ఉక్కపోతను భరించలేక  కాగితాలతో గాలి వీచుకుంటూ కనిపించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై తీర్మానాలు చేశామని, వాటి వివరాలను అధికారులు ప్రజాప్రతినిధులకు అందజేస్తారని కలెక్టర్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని