logo

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం

వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి.

Published : 29 Mar 2024 04:36 IST

రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణాల్లో జాప్యం

అనంతపురం మార్గంలో అర్ధాంతరంగా ఆగిన రైల్వే వంతెన అనుసంధాన రహదారి

రాయదుర్గం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. ఆయా రైల్వేగేట్ల వద్ద కొన్నేళ్లుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అనంతపురం మార్గంలో నాలుగేళ్ల కిందట, కణేకల్లు రోడ్డులో మూడేళ్ల కిందట ట్రాక్‌లపై మాత్రమే రైల్వే వంతెనల నిర్మాణాలు పూర్తయ్యాయి.

50 శాతం నిధులకు రైల్వేశాఖ డిమాండు

రైల్వే శాఖలో ఎక్కడైనా పనులు చేపట్టాలంటే 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం, 50 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రైల్వే పరిధిలో వంతెనలను సుమారు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించినందున, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా నిధులు ఇవ్వగానే అనుసంధాన రహదారులు నిర్మిస్తామని రైల్వేశాఖ చెబుతోంది. అనుసంధాన రహదారులకు అవసరమయ్యే స్థలాన్నిస్తున్నందున స్థలం విలువను అంచనా వేసి మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నా.. ఆ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ఈ రెండు వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణానికి గతంలో రూ.60 కోట్లు అవసరం కాగా ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం ప్రస్తుతం రూ.77 కోట్ల మేర అంచనాలు పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.

తప్పని అవస్థలు..

కణేకల్లు రోడ్డుమార్గంలో రైల్వే గేటు స్టేషన్‌ సమీపంలో ఉండటంతో రైళ్లు నెమ్మదిగా వెళతాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా వేసిన గేట్లు తీయటానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతోందని, ఎదురెదురు వాహనాల రాకపోకల సందర్భంగా ఒక్కో మారు అరగంటకు పైగా సమయం పడుతోందని వాహనదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో కణేకల్లు రోడ్డును చుట్టేసి వెళ్లాల్సి వస్తోంది. ః అనంతపురం మార్గంలోని రైల్వే గేటు వైపు ప్రధాన వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 108 వాహనాలు అత్యవసర సమయాల్లో జేఆర్‌ఎస్‌ కాలనీల్లోని అంతర్గత రైల్వే మార్గం ద్వారా ఒక కిలో మీటరు దూరం చుట్టేసి వెళ్లాల్సి వస్తోంది.

రోజూ 33 సార్లు ..

రెండు రైల్వే గేట్ల మార్గాల్లో రోజుకు 25 గూడ్సు, 6 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి. నాలుగు వారాంతపు రైళ్లు రాయదుర్గం రైల్వే స్టేషన్‌ మీదుగా వెళుతున్నాయి. ఈ లెక్కన రోజుకు దాదాపు 33 మార్లు రైల్వే గేట్లు వేస్తూ, తీస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాహనదారుల అవస్థలు ఎక్కువగా ఉంటాయి.


నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తారు

రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణాల కోసం తరుచుగా ప్రభుత్వం ద్వారా రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నాం. నిర్మాణ వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.77 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తారు.

రవిశంకర్‌రెడ్డి, డీఈ, ఆర్‌అండ్‌బీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు