logo

కరెంటు బిల్లు చూస్తేనే షాక్‌!

విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు.

Updated : 20 Apr 2024 04:53 IST

జగన్‌ పాలనలో బాదుడే బాదుడు
అనంతపురం (విద్యుత్తు), న్యూస్‌టుడే

విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. ఛార్జీలను పెంచబోమంటూ ఓట్లు వేయించుకున్న జగన్‌ నడ్డివిరిచారని వాపోతున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅఫ్‌, ఈడీ (ఎలక్ట్రిసిటీ డ్యూటీ) పేరిట సుమారు రూ.475 కోట్ల భారం మోపి వసూలు చేశారు. ఉమ్మడి జిల్లాలో గృహ కనెక్షన్లు 12 లక్షలు ఉన్నాయి. సర్దుబాటు, ట్రూఅప్‌, ఈడీ పేరిట అదనంగా కలిపి విడతల వారీగా యూనిట్‌కు కొంత మొత్తం నిర్ణయించి ఆ మేరకు బిల్లుల్లో కలిపారు.

ఆరు పైసలు నుంచి రూపాయి

తెదేపా ప్రభుత్వ హయంలో గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులకు ఈడీ కింద యూనిట్‌కు రూ.6 పైసలు వసూలు చేసేవారు. ఈ మొత్తం ప్రభుత్వానికే వెళుతుంది. వైకాపా సర్కారు వచ్చాక గృహ సర్వీసులకు రూ.6 పైసలు అట్లాగే ఉంచినా.. వాణిజ్య, పరిశ్రమల సర్వీసులు వినియోగించిన యూనిట్‌కు ఒక రూపాయి చేసింది. ఇలా పెంచినప్పటి నుంచి సదరు సర్వీసులకు రూ.65 కోట్లు అదనపు భారం మోపింది.

ఫిక్స్‌డ్‌ ఛార్జీలు అంటూ...

తెదేపా ప్రభుత్వ హయంలో గృహ సర్వీసులకు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఉండేవి కావు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గృహ సర్వీసులకు సంబంధించి కిలోవాట్‌కు రూ.10 ఫిక్స్‌డ్‌ ఛార్జీ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. సాధారణంగా గృహ కనెక్షన్‌కు ఐదు కిలోవాట్ల లోడ్‌ తీసుకుంటారు. అంటే సగటున ఫిక్స్‌డ్‌ ఛార్జీల రూపేణా అదనంగా రూ.50 చెల్లించాల్సి వస్తోంది.  ఇప్పటి వరకు రూ.10 కోట్లుపైగా వినియోగదారుల నుంచి విద్యుత్తు శాఖ వసూలు చేసింది.

  • అనంతపురం మూడో రోడ్డులో ఉన్న గృహ విద్యుత్తు కనెక్షన్‌దారు హరినాథ్‌ ఈఏడాది ఫిబ్రవరిలో 140 యూనిట్లు వినియోగించగా రూ.662 బిల్లు వచ్చింది. ఇదే సర్వీసుకు  ఇంచుమించు అవే యూనిట్లకు సంబంధించి మార్చిలో రూ.832 బిల్లు వచ్చింది. ఈలెక్కన సదరు వినియోగదారుకు అదనంగా రూ.250 భారం పడింది.
  • రాప్తాడు మండలం ఆకుతోటపల్లిలో వాణిజ్య కనెక్షన్‌దారు ఆదినారాయణ ఫిబ్రవరిలో 2,778 యూనిట్లు వినియోగించగా రూ.30,715 బిల్లు వచ్చింది. అటుఇటుగా యూనిట్లు మార్చిలో రాగా రూ.34,608 బిల్లు వచ్చింది. దీంతో రూ.4 వేలు అదనంగా చెల్లించారు.

వీరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షలాది వినియోగదారులది ఇదే పరిస్థితి.

తెదేపా హయాంలో ఇష్టారాజ్యంగా విద్యుత్తు ఛార్జీలు పెంచేశారు.. బాదుడే బాదుడే అంటూ దీర్ఘాలు తీశారు జగన్‌. అధికార పగ్గాలు చేపడితే ఛార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్ష నాయకుడి హోదాలో పలుమార్లు హామీ ఇచ్చారు. తీరా గద్దె నెక్కాక హామీని తుంగలోకి తొక్కి.. దొడ్డిదారిన బిల్లులు అమాంతం పెంచేసి అదనపు భారం మోపారు. సర్దుబాటు పేరిట వినియోగదారులు షాక్‌ తినేలా చేశారు. గృహ కనెక్షన్లకు సంబంధించి చాలా మంది వినియోగదారులు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.మాట తప్పను.. మడమతిప్పను అంటూ జగన్‌ చెప్పిన మాటలు నీటిమూటలే... నమ్మి మోసపోయాం అని ఆవేదన చెందుతున్నారు.

రెట్టింపు ఛార్జీలు

ఉరవకొండ: పట్టణానికి చెందిన తిరుపతయ్య వృత్తి రీత్యా రజకుడు. దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బొగ్గుల ధరలు విపరీతంగా పెరగడంతో విద్యుత్తుతోనే ఇస్త్రీ చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇతనికి నెలకు రూ.600 విద్యుత్తు బిల్లు వచ్చేది. ఇప్పుడు అది రూ.1200 దాటుతోంది. గతంలోనూ విద్యుత్తు ఆధారంగా ఇస్త్రీ చేస్తూ వచ్చారు. రోజంతా కష్టపడితే రూ.500 వస్తుంది. దీనికితోడు విద్యుత్తు బిల్లు అధికంగా వస్తుండడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం పెంచడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.

భారంగా జీవనం

పామిడి: పామిడికి చెందిన లలిత కుట్టు మిషన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. భర్త భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. కొంతకాలంగా పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుస్తులు కుట్టగా వచ్చే రూ.3 వేల ఆదాయంతో ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. గతంలో రూ.300 విద్యుత్తు బిల్లు రాగా.. ప్రస్తుతం రూ.600 వస్తోంది. నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో నెల గడవటం కష్టంగా మారిందని లలిత చెబుతున్నారు. విద్యుత్తు బిల్లును సమయానికి చెల్లించకపోతే ఉన్నఫళంగా సరఫరా తీసేస్తున్నారని వాపోతున్నారు.

చేసిన కష్టం కరెంటు బిల్లుకే

శింగనమల, గార్లదిన్నె: గార్లదిన్నెకు చెందిన సుబ్బు బస్టాండ్‌ సమీపంలో ఇరవై ఏళ్లుగా పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల సంపాదన దాదాపు రూ.8 వేలు. ఇందులో కరెంటు బిల్లు రూ.1500 చెల్లించాలి. మిగిలిన రూ.6,500లతో ఇద్దరు పిల్లలు, భార్యను పోషించాలి. గతంలో రూ.400 విద్యుత్తు బిల్లు వచ్చేది. మండల కేంద్రానికి పరిసర గ్రామాలవారు వచ్చేవారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు పంక్చర్‌, గాలి వంటి వాటితో దాదాపు రూ.15 వేలు వచ్చేది. గ్రామాలవారు రాకపోవడంతోపాటు ఆదాయం తగ్గింది. పెరిగిన విద్యుత్తు బిల్లు కుటుంబ పోషణకు అడ్డుగా మారింది. చేసిన కష్టం కరెంటు బిల్లుకే సరిపోతోందని సుబ్బు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగున్నరేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాపై మోపిన అదనపు భారం: రూ.475 కోట్లు

ఉమ్మడి అనంత జిల్లాలో విద్యుత్తు సర్వీసులు ఇలా..

గృహ కనెక్షన్లు: 12 లక్షలు
వాణిజ్య : 1.10 లక్షలు
చిన్న, మధ్యతరహా
పరిశ్రమలు: 25,000
భారీ పరిశ్రమలు: 600
తాగునీటి పథకాలు, విద్యాసంస్థలు, మున్సిపాలిటీలు: 35,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు