logo

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు

దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు.

Published : 24 Apr 2024 05:08 IST

ఇళ్ల దగ్గర ఉన్నా మస్టర్లలో హాజరు

దయ్యాలకుంటపల్లి గువ్వలగొండి కొండలో తక్కువ మంది కూలీలతో పనులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. రాళ్ల గుట్టలో కూలీలు పనులు చేయడానికి ఏమాత్రం అనువుగా లేదు. వడ్డి కృష్ణవేణి అనే మేటీ కింద 78 మంది కూలీలు పనులు చేస్తున్నట్లు మస్టర్లలో హాజరు వేశారు. సాధారణంగా ఒక మేటీ కింద 20 మంది కూలీలు మాత్రమే పనులు చేయడానికి అవకాశం ఉంది. ఒకే మేటీ కింద 78 మంది పనులు చేస్తున్నట్లు రాసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. పనుల వద్దకు వెళ్లి పరిశీలించగా కృష్ణవేణి గ్రూపులో కేవలం 20 మంది మాత్రమే పనులు చేస్తున్నారు. ఈ విషయంపై మేటీని, కూలీలను ప్రశ్నించగా తమకేమి తెలియదని సమాధానమిచ్చారు. వారానికి కూలి రూ.1200 మాత్రమే వస్తుంది. ఉపాధిహామీ సిబ్బంది, అధికారులు పనులకు రాకున్నా తమకు అనుకూలమైన వారి పేరున హాజరు వేసి కూలి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడిన తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న మండలంలో అక్రమాలు జరుగుతుంటే ఉపాధిహామీ, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దయ్యాలకుంటపల్లి సాంకేతిక సహాయకుడు క్రిష్ణయ్యను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలిచ్చారు. ఈ విషయం తనకు తెలియకుండా జరుగుతోందని, విచారిస్తానని సమాధానమిచ్చారు. ఉపాధి హామీ అక్రమాల్లో వైకాపా నాయకులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి వాటాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని