logo

షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..

జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు.

Published : 10 May 2024 04:01 IST

ఎస్సీ కాలనీల్లో నివాసం ఉంటేనే విద్యుత్తు రాయితీ అంటూ మెలిక
పేరుకే నా.. నా.. అంటూ జగన్‌ ప్రకటనలు
క్షేత్రస్థాయిలో ఉచిత సర్వీసుల తొలగింపు

  • అనంతపురంలోని డీ-5 సెక్షన్‌ కార్యాలయం పరిధిలో ఉన్న ఒక కాలనీలో ఓ దళితుడు నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి సర్వీసుకు కొన్ని నెలలపాటు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలు చేశారు. నాలుగు నెలల క్రితం విద్యుత్తు అధికారులు సదరు ఎస్సీ నివాస సర్వీసులు ఎస్సీ కాలనీలో లేదని ఇతర ప్రాంతంలో ఉంటూ ఉచిత విద్యుత్తు వాడినట్లు గుర్తించి సర్వీసు తొలగించారు. అప్పటినుంచి సదరు వ్యక్తి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.400 వరకు విద్యుత్తుశాఖకు బిల్లు కడుతున్నాడు.
  • కదిరి రూరల్‌ పరిధిలో గిరిజనుడు నివాసం ఉంటున్నాడు. అతడి నివాసం ఉంటున్న ఇంటి సర్వీసుకు ఆరు నెలల వరకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇచ్చారు. విద్యుత్తు అధికారులు సదరు వ్యక్తి ఎస్టీ కాలనీలో లేకుండా వేరే కాలనీలో ఉంటూ ఉచిత విద్యుత్తు వాడుతున్నట్లు అధికారులు గుర్తించి సర్వీసుకు ఉచిత విద్యుత్తును రద్దు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రతి నెలా తన ఇంటికి 200 యూనిట్లులోపే విద్యుత్తు వాడుతున్నా ఎస్టీ కాలనీలో లేనందుకు  విద్యుత్తు బిల్లు కడుతున్నాడు.  

అనంతపురం (విద్యుత్తు), న్యూస్‌టుడే: జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. తాను అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు సర్వీసులకు నెలకు 200 యూనిట్లు వరకూ ఉచితంగా సరఫరా ఇస్తానని జగన్‌ ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి వారంతా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక జగనన్న తన మార్కు రాజకీయానికి తెర లేపారు. ఉచిత కరెంటు వినియోగించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివాసాలుండాలి. అప్పుడే ఉచిత విద్యుత్తు అమలవుతుందని మెలిక పెట్టాడు. దీంతోపాటు అనేక షరతులు విధించారు. ఆ కాలనీల్లో ఉండేవారికి తప్ప మిగిలిన వారికి ఉచిత కరెంటు సరఫరా అమలు కాలేదు. ఈ విద్యుత్తు పొందాలంటే ఎస్సీ కాలనీలోనే ఉండాలా.. ఇది కులవివక్షకు అవకాశం ఇవ్వడం కాదా? అని ఆయా వర్గాలు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉచిత విద్యుత్తు సర్వీసులు..

ఈ ఏడాదిలో మార్చి నుంచి ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 1,28,814 ఎస్సీ విద్యుత్తు సర్వీసులుండగా ఇందులో 1,04,156 సర్వీసులు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును వినియోగించారు. అలాగే 36,190 ఎస్టీ విద్యుత్తు సర్వీసులుండగా ఇందులో మార్చి నెలలో 26,361 సర్వీసులు నెలకు 200 యూనిట్లు రాయితీ పొందారు.

తొలగించినవి ఇలా..

అనంతపురంలో 5,136, కదిరి 1,538, పెనుకొండ 619, పుట్టపర్తి 163, కదిరి 400, మడకశిర 210తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పలు పట్టణ, మండల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసాలుంటూ నెలకు 200 యూనిట్లు విద్యుత్తు రాయితీ పొందుతున్న రమారమి 14 వేల ఎస్సీ, ఎస్టీల సర్వీసులకు రాయితీ అమలు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో ఉండి ఉచితంగా కరెంటు యూనిట్లు వాడిన వారి వివరాలను గుర్తించి సదరు ఎస్సీ, ఎస్టీలు ఎన్ని నెలల కరెంటు సరఫరా వాడారో పరిశీలించి ఆ మొత్తాలను విద్యుత్తు అధికారులు తిరిగి వెనక్కి వసూళ్లు చేశారు.


14 వేల సర్వీసులు..

మ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 14 వేల మంది ఎస్సీ, ఎస్టీల నివాసాలకు రాయితీ విద్యుత్తు సరఫరాను నిబంధనల పేరుతో నిలిపివేశారు. వీరి సర్వీసులకు కొన్ని నెలల పాటు రాయితీ సరఫరా ఇచ్చినప్పటికీ తరువాత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల్లో నివాసాలుంటూ రాయితీ విద్యుత్తును పొందుతున్నారని విద్యుత్తు అధికారులు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉండే వారికి మాత్రమే రాయితీ విద్యుత్తు సరఫరా ఇస్తూ మిగిలిన ప్రాంతాల్లో ఉండేవారందరి నివాసాలకు రాయితీ కరెంటు సరఫరా నిలిపివేశారు. మిగిలిన వారంతా తమ సొంత డబ్బులు విద్యుత్తు బిల్లులు లకడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని