logo

ఎడారి నివారణ ఎండమావే

జిల్లాలోని బొమ్మనహాళ్‌, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి.

Published : 10 May 2024 04:05 IST

ఐదేళ్లలో ఒక్క రూపాయీ ఇవ్వని జగన్‌ సర్కారు
ఇసుక మేటలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు

బొమ్మనహాళ్‌, కణేకల్లు, న్యూస్‌టుడే: జిల్లాలోని బొమ్మనహాళ్‌, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. దర్గాహొన్నూరు, గోవిందవాడ, కల్‌హోళ, బొల్లనగుడ్డం, బిదురుకుంతంŸ, నాగేపల్లి, తుంబిగనూరు, మాల్యం, కళ్లేకుర్తి, మీనహళ్లి, బెళుగుప్ప మండలంలోని శ్రీరాంపురం గ్రామాల్లో వేదవతి హగరిలోని సున్నితమైన ఇసుక కొట్టుకువచ్చి దిబ్బలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి ఎడారి నివారణ పథకాన్ని తెదేపా ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే నిధులు మంజూరు చేసి నివారణ చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెదేపా హయాంలో రూ.300 కోట్ల కేటాయింపు

బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో ఇసుక మేటలను అరికట్టడానికి, సున్నితమైన ఇసుకను చౌడు భూములకు తరలించి సారవంతమైన భూములుగా మార్చేందుకు గత తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేదవతి హగరి నదిని జీవనదిగా మార్చేందుకు  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్‌, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశంను నిర్వహించి చర్చించారు. ఈ మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో ఉచితంగా బోర్లు వేయించారు. డ్రిప్‌ సౌకర్యం కల్పించారు. ఇసుకను చౌడు భూములకు తరలించారు. దర్గాహొన్నూరు, మాల్యం, గరుడచేడు, గోవిందవాడ, బొల్లనగుడ్డం తదితర గ్రామాల్లో ఇసుక దిబ్బల్లో ఉచితంగా బోర్లు వేయించి పండ్ల మొక్కలు సాగు చేయించారు. బొల్లనగుడ్డం గ్రామంలో నాటి రకం రేగు చెట్లకు హైబ్రిడ్‌ మొక్కలతో అంటు కట్టి ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది సత్ఫలితాన్నిచ్చింది. వేరుసెనగ మొలకపై ఇసుక కొట్టుకుని రాకుండా పొలం చుట్టు సుబాబుల్‌ మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఏడారి నివారణ పథకాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.


అధికార పార్టీ నాయకులు కన్నెత్తి చూడలేదు

- ఆనంద్‌, దర్గాహొన్నూరు

వైకాపా ప్రభుత్వ హయాంలో ఎడారి నివారణ పథకం నిర్వీర్యం అయ్యింది. తెదేపా ప్రభుత్వ పాలనలో తమ పొలాలకు వ్యవసాయ బోర్లు వేయించి డ్రిప్‌ సౌకర్యం కల్పించారు. సపోటా, హైబ్రిడ్‌ రేగు చెట్ల పెంపకం చేపట్టాం. వైకాపా ప్రభుత్వం ఇసుక దిబ్బల్లో ఒక్క బోరు వేయించలేదు. ఐదేళ్లలో ఎడారి నివారణ పథకాన్ని పట్టించుకోలేదు. ఒక్క సాయం కూడా చేయలేదు.


పంటల సాగుకు అవస్థలు

- రాజశేఖరగౌడ్‌, రైతు, తుంబిగనూరు

నాకున్న ఆరెకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఏటా పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. ఇసుక దిబ్బలు తరలించడం కష్టంగా ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎడారి నివారణలో భాగంగా నల్లరేగడి నేలల రైతుల పంట పొలాలకు ఉచిత ఇసుక తరలింపు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఇసుక దిబ్బల నివారణను అటకెక్కించడంతో అవస్థ పడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని