logo

పరికరం లేదు.. నీడా కానరాదు..!

పల్లెల్లోని పేదలకు కనీస ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో సామాజిక ఆస్తులను సృష్టించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో నెల రోజులకూ ఆ పరిస్థితి కనిపించడంలేదు. పనికి అవసర

Published : 23 May 2022 05:53 IST

ఐదేళ్లుగా ఉపాధి కూలీలకు అందని గడ్డపారలు

సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్న వైనం


పెద్దపంజాణి మండలం చిన్నారికుంట చెరువులో ఫిష్‌పాండ్‌ పనిలో నిమగ్నమైన కూలీలు

పల్లెల్లోని పేదలకు కనీస ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో సామాజిక ఆస్తులను సృష్టించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో నెల రోజులకూ ఆ పరిస్థితి కనిపించడంలేదు. పనికి అవసరమైన పరికరాలూ అందజేయడం లేదు. జిల్లాలో ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని ప్రదేశంలో నీడ, నీళ్ల సౌకర్యంతోపాటు ప్రథమ చికిత్సకు అవసరమైన మందుల కిట్‌ అందుబాటులో ఉండటంలేదు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, పెద్దపంజాణి: గ్రామాల్లో జాబ్‌ కార్డులున్న వ్యక్తులకు ఏడాదికి వంద పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇదే సమయంలో వంద రోజులు పనిచేసే బృందాలకు గడ్డపార (గునపం) అందించాలి. పదును పెట్టేందుకు వారానికి రూ.10 చొప్పున నగదు జమ చేయాలి. ఐదేళ్లుగా గునపాలు సరఫరా చేయడంలేదు. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం కరవవుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతే ఇస్తామని చెబుతున్నారు. అధికారులను అడిగితే.. కూలి ఖర్చులో కలిపి ఈ మొత్తాన్ని అందిస్తున్నామని అంటున్నారు. దీంతో ఎక్కడ కూలి తక్కువ వస్తుందోననే ఉద్దేశంతో కూలీలే సొంతంగా వాటిని సమకూర్చుకుంటున్నారు. మరికొందరు అరిగిన గడ్డపారలతోనే పనులు చేస్తున్నారు.

సేద తీరాలంటే చెట్ల చెంతకు వెళ్లాల్సిందే

పని ప్రదేశంలో కూలీలు సేదతీరే ప్రాంతంలో కచ్చితంగా నీడను కల్పించాలని కేంద్రం నిర్దేశించింది. ప్రభుత్వం నుంచి టార్పాలిన్లు రాకపోవడంతో జిల్లావ్యాప్తంగా కూలీలు పని ముగిసిన తర్వాత ఎండలోనే కూర్చోవాల్సి వస్తోంది. సమీపంలో చెట్లు ఉంటే వాటి చెంత సేద తీరుతున్నారు. పనులు చేస్తున్న సందర్భంలో కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్‌ కూడా అందుబాటులో ఉండటం లేదు.

సొంతంగా కొన్నా

ఉపాధి పనులకు అరిగిపోయిన గడ్డపార తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. దీంతో సొంతంగా డబ్బులు వెచ్చించి గడ్డపార కొనుగోలు చేసి పనులు చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీలకు పరికరాలు, పని ప్రదేశంలో నీడ, మెడికల్‌ కిట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.  - వెంకట రమణ, ఉపాధి కూలీ, చిన్నారికుంట

జిల్లాలో జాబ్‌కార్డులున్న కుటుంబాలు : 1,50,682

ఏప్రిల్‌ చివరి నాటికి పనుల్లో పాల్గొన్నవి : 45,956

వీరికి కల్పించిన పనిదినాలు : 6,06,248

నిలువ నీడలేక చెట్టు కింద సేదతీరుతున్న కూలీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు