logo

త్వరపడి.. తడబడి..!

పూతలపట్టు మండలం చిటిపిరాళ్ల పంచాయతీ సిద్ధలింగనపల్లికి చెందిన రైతు రామచంద్రారెడ్డికి సర్వే నంబరు 15/1ఏలో 1.26 ఎకరాల పొలం ఉంది. శుక్రవారం పంపిణీ చేసిన భూమి యాజమాన్య హక్కు పత్రంలో దీన్ని 1.16 ఎకరాలుగా చూపారు.

Published : 27 Nov 2022 04:21 IST

రీసర్వేలో లోపాలతో కొత్త చిక్కులు
భూహక్కు పత్రాల పంపిణీతో వెలుగులోకి


పాత పాస్‌ పుస్తకంలో 1.26 ఎకరాలు..

* పూతలపట్టు మండలం చిటిపిరాళ్ల పంచాయతీ సిద్ధలింగనపల్లికి చెందిన రైతు రామచంద్రారెడ్డికి సర్వే నంబరు 15/1ఏలో 1.26 ఎకరాల పొలం ఉంది. శుక్రవారం పంపిణీ చేసిన భూమి యాజమాన్య హక్కు పత్రంలో దీన్ని 1.16 ఎకరాలుగా చూపారు. తనకు పది సెంట్ల భూమి తక్కువ నమోదైందని అధికారులకు రైతు విన్నవించారు.

* గుడిపాల మండలంలో ఓ రైతుకు 2.94 ఎకరాలు ఉండగా 2.77 ఎకరాలు ఉన్నట్లు పత్రాల్లో నమోదైంది. తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమి ఇప్పుడు 17 సెంట్లు ఎలా తగ్గించారని ఆ రైతు ప్రశ్నిస్తున్నారు. మరో రైతుకైతే ఏకంగా 40 సెంట్లు తక్కువగా నమోదు చేశారు. ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేకుండా భూమి సాగు చేసుకున్నామని.. ఇప్పుడు కొత్తగా తలనొప్పులు తెచ్చారని అన్నదాతలిద్దరూ వాపోతున్నారు.

* కుప్పం నియోజకవర్గంలో ఓ రైతుకు ఎకరాకు అసైన్డ్‌ పట్టా ఉండగా పక్కనే ఉన్న గుట్టలో 50 సెంట్లు చదును చేసుకుని సాగు చేసుకుంటుండగా అతనికి 1.50 ఎకరాలు ఉన్నట్లు చూపారు. దీన్ని ముందుగానే వీఆర్వో గుర్తించి తప్పు సరిదిద్దేందుకు సమాయత్తమయ్యారు.

* గంగాధరనెల్లూరు మండలంలో మాత్రం ముందుగానే వీటిని సరిదిద్దడంతో ఇబ్బందులు తలెత్తలేదు.  

..భూహక్కు పత్రాల్లో దొర్లిన తప్పిదాల కారణంగా కొన్నాళ్లుగా నిద్రే లేకుండా పోయిందని రెవెన్యూ యంత్రాంగం, ఇకపై సరిహద్దు పొలాల వారితో గొడవలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు (కలెక్టరేట్‌): సమగ్ర భూ సర్వే పల్లెల్లో వివాదాలకు శాశ్వత చరమగీతం పలుకుతామని పదేపదే ప్రభుత్వం ప్రకటించింది. త్వరత్వరగా పూర్తి చేయాలని సర్వే సిబ్బందిపై పెంచిన ఒత్తిళ్లతో రీసర్వేలో పలు తప్పులు దొర్లాయి.. తాజాగా పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమైంది. కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పలువురికి ఎక్కువ విస్తీర్ణం నమోదైందన్న విషయాన్ని తెలుసుకున్న రైతులు తమకు  త్వరగా పత్రాలు ఇవ్వాలంటూ అధికారులను అడుగుతున్నారు.

‘జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష’ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు తొలుత భూ రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇది పూర్తయిన గ్రామాల్లో రీసర్వే మొదలుపెట్టారు. 2023 డిసెంబరు నాటికి మొత్తం తంతును ముగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైలెట్‌గా ఎంపిక చేసిన గ్రామాలు, మరికొన్ని పల్లెల్లో త్వరగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం రెవెన్యూ, సర్వే సిబ్బందిపై ఒత్తిడి పెంచింది. ఆ హడావుడే ప్రస్తుత సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో రెవెన్యూ గ్రామాలు: 822
డ్రోన్‌ సర్వే పూర్తయినవి: 737
భూహక్కు పత్రాలిచ్చిన గ్రామాలు:  134

యాజమాన్యపు హక్కు పత్రంలో 1.16 ఎకరాలు..


పంపిణీ రోజే ప్రశ్నల వర్షం

ఈనెల 25న జిల్లాస్థాయిలో భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా అక్కడే కొందరు రైతులు తమ విస్తీర్ణం తక్కువగా నమోదైందంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో ఏడాదిలోపు ఎప్పుడైనా వీటిని సరిదిద్దుకోవచ్చని వారు స్పష్టం చేశారు. రీసర్వేకు ముందు ఉన్నతాధికారులు విడుదల చేసిన మార్గదర్శకాల్లో ప్రస్తుతం ఉన్న భూమి కన్నా 5 శాతం అదనం లేదా 5 శాతం తక్కువ ఉన్నా పత్రాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఇంతకు మించి విస్తీర్ణంలో తప్పులు రావడంతో ఇప్పుడు వీటిని సరిచేసేందుకు రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని 134 గ్రామాల్లో హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ 30 శాతం కన్నా తక్కువచోట్లే రైతులకు అందించారు.

ఏడాది వరకు అవకాశం - రాజశేఖర్‌, డీఆర్వో

సాంకేతికత సాయంతో రీసర్వే చేపట్టినందున జిల్లాలో రీ సర్వే సక్రమంగా సాగింది. ఎక్కడైనా ఒకట్రెండుచోట్ల విస్తీర్ణంలో తప్పులు దొర్లి ఉంటే వాటిని ఏడాది వరకు సరిచేసేందుకు అవకాశం కల్పించాం. రైతులెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని