logo

ఒకటో తేదీ వచ్చే..

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్‌ గత కొంతకాలంగా జమ కావడం లేదు

Published : 01 Feb 2023 04:16 IST

జీతాలు, పింఛన్లు జమయ్యేనా ?

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్‌ గత కొంతకాలంగా జమ కావడం లేదు. ఠంఛనుగా జరిగే ఈ ప్రక్రియ వారాల తరబడి సాగదీత ప్రక్రియగా మారుతోంది. గత  నెలలో సంక్రాంతి పండుగ సమయంలోనూ వేతనాలు, పింఛన్లు జమ కాని పరిస్థితి జిల్లాలో కనిపించిందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ఉద్యమించే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. తమ ఉద్యమాల్లో ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వేయాలని డిమాండు చేసే పరిస్థితికి రావడం గమనార్హం. జనవరి నెల జీతం బుధవారం జమవుతుందా అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఖజానా శాఖ ఉద్యోగులు ప్రతి నెలా బిల్లుల్ని సకాలంలో అప్‌లోడ్‌ చేసినా ఒకటో తేదీ జీతం రావడం కష్టమవుతోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 22 ఉప ఖజానాల పరిధిలో వెయ్యి మంది డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులు (డీడీవో) ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు 50 వేల మంది, పింఛనర్లు మొత్తం 30 వేల మంది ఉన్నారు. గెజిటెడ్‌ స్థాయి అధికారుల నుంచి క్లాస్‌-4 స్థాయి వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఆప్కాస్‌ కింద, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా అన్ని రకాల బిల్లులు 4 వేల వరకు అందుతున్నాయి. ప్రతి నెలా 17 నుంచి 25లోపు సంబంధిత డీడీవోల నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తారు. 26 నుంచి 30వ తేదీ లోపు సదరు ఎస్టీవోలు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు వచ్చే నగదుతో ఇంటి అద్దె, ఈఎంఐలు, సరకులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గతకొన్ని నెలలుగా జీతం ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పట్లేదు.

ఎదురుచూపులు

పెన్షనర్లకు పీఆర్‌సీ బకాయిలు జమవుతాయా లేదా అని విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నాలుగు త్రైమాసిక కంతుల పీఆర్‌సీ బకాయిల చెల్లింపులు ఇంకా పెండింగ్‌లో ఉందని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇందులో మొదటి కంతును జనవరి పింఛన్‌తో కలిపి చెల్లించాలన్న వినతులు అమలవుతాయో? లేదో వేచి చూడాలి మరి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని