logo

అప్పగించిన భూముల్లో అప్పనంగా..!

ఇవి ఏర్పేడు మండలం పాగాలి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు. వీటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

Updated : 01 Feb 2023 07:16 IST

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
ప్రభుత్వ స్థలాలే లక్ష్యంగా దందా

ఇవి ఏర్పేడు మండలం పాగాలి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు. వీటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పలు దఫాలు ఉన్నతాధికారులు పరిశీలించినా చెరువుల్లో నీరు   ఉండటంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లో మట్టిని జేసీబీలతో యథేచ్ఛగా తవ్వి ట్రక్కుల్లో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేరు.
శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: చెరువుల్లో నీటి నిల్వలు ఉండటంతో అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో వీలైనంత మేర మట్టిని తవ్వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో ఏపీఐఐసీకి అప్పగించేందుకు సిద్ధం చేసిన భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల సహకారంతో ఈ అక్రమ తంతు సాగుతోంది. నీటి నిల్వలు తగ్గిన చెరువుల్లోనూ మట్టిని తవ్వేందుకు కొందరు నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

నీటిమట్టం తగ్గగానే చెరువుల్లోనూ..

ఇది శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లి చెరువు. నీటి నిల్వలు తగ్గిన ప్రదేశంలో మట్టి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జేసీబీతో ట్రాక్టర్ల కొద్దీ మట్టిని ఇష్టానుసారంగా పక్కనున్న పరిశ్రమలకు తరలిస్తున్నారు. అనధికారికంగా సాగుతున్నా వీఆర్వోలు, జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.


నిలువరిస్తాం

మట్టి తరలింపు చట్టరీత్యా సరికాదు. దీనిపై ఎక్కడిక్కడ నిఘా ఉంచుతున్నాం. పాగాలి పంచాయతీ పరిధిలో అక్రమ తరలింపు విషయం మా దృష్టికి రాలేదు. అక్కడి వారితో మాట్లాడి అక్రమ తరలింపును నిలువరిస్తాం. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడం.

ఉదయసంతోష్‌, తహసీల్దార్‌, ఏర్పేడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని