logo

ఎన్నిక ఏదైనా నగరంలో ప్రత్యేకమే

తిరుపతిలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నిక ఏదైనా విజయం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దొడ్డిదారి పనులు మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.

Published : 13 Mar 2023 07:33 IST

నకిలీ ఓట్ల ప్రభావం

ఈనాడు-తిరుపతి; న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక): తిరుపతిలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నిక ఏదైనా విజయం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దొడ్డిదారి పనులు మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటన సమయం నుంచి తెరవెనుక జరిగే కుట్రలు ఎన్నికల ముందు రోజు వరకు బయటకు పొక్కనీయడం లేదు. అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికల తీరుతో విద్యావంతులు కూడా పోలింగ్‌కు దూరం అవుతున్నారు. ఈ కారణంగా  అత్యల్ప పోలింగ్‌ నమోదయ్యే అసెంబ్లీ నియోజకవర్గంగా తిరుపతి నిలుస్తోంది.

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యహరిస్తున్నట్లు ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగు చూశాయి. పట్టభద్రులు కాని వేలాది మందికి  ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితాలో చోటు కల్పించినట్లు ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు అందాయి. ఈ వ్యవహారంలో 8 మంది అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఒక్కో ఇంటి చిరునామాతో 10 నుంచి 20కి పైగా ఓట్లు నమోదు కావడం, ఖాళీ జాగాలు, వాలంటీర్ల గృహాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వాటి యజమానులకే  తెలియకుండా ఓట్లు నమోదు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొర్లగుంటలో 150 మంది ఆటో డ్రైవర్లకు ఓటు హక్కు కల్పించి వారందరినీ ఓటు హక్కు వినియోగించాలని భయపెడుతూ ఓ కార్పొరేటర్‌ పంపిన వాట్సప్‌ సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇతరులు నామినేషన్‌ వేయకుండా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తరువాత తిరుపతిలో కార్పొరేషన్‌, పార్లమెంట్‌ ఉప ఎన్నికలు, తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇతర పార్టీల వారిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, మాట వినని వారిని కిడ్నాప్‌ చేయడం, వేసిన వారిపై దాడులు చేయడంతో పాటు బెదిరించి ఉపసంహరించుకునేలా చేయడం, అభ్యర్థులకు తెలియకుండా బినామీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అనంతరం జరిగిన పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలతో దొంగ ఓటర్లను రప్పించి వారి వాహనాలను నగర శివార్లలో నిలిపి ఆటోల్లº తరలించి వేలాది దొంగ ఓట్లు వేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి వారికి పంచినట్లు విపక్షాలు గుర్తించి పోలీసులకు పట్టించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో జరిగిన తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో 90 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలింగ్‌ కేంద్రంలో కూర్చొని దగ్గరుండి రిగ్గింగ్‌కు పాల్పడిన ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని