logo

తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సుదీర్ఘ పరిశీలన అనంతరం ద.మ.రైల్వే అధికారులు ప్రారంభించడానికి పచ్చజెండా ఊపనున్నారు.

Updated : 27 Mar 2023 04:39 IST

తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే:  సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సుదీర్ఘ పరిశీలన అనంతరం ద.మ.రైల్వే అధికారులు ప్రారంభించడానికి పచ్చజెండా ఊపనున్నారు. వచ్చేనెల మొదటివారంలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య ప్రయాణికులతో పాటు శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటి వరకు ఆ మార్గంలో వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ, శబరి, సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా సికింద్రాబాద్‌- తిరుపతి చేరుకోవడానికి 11 నుంచి 12 గంటలు పడుతోంది. ఈ మార్గంలో ప్రయాణికులు, శ్రీవారి భక్తుల డిమాండ్‌ దృష్ట్యా ద.మ.రైల్వే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని నిర్ణయించింది. అందుకు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య మూడు మార్గాలను పరిశీలించారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు మీదుగా నడపాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆ మార్గంలో 130 కి.మీ వేగంతో వెళ్లేలా ట్రాక్‌లను పటిష్ఠం చేశారు.

రెండు స్టేషన్లే..

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నంబరు, రాకపోకల సమయాలు, టికెట్‌ ధర ద.మ.రైల్వే ఉన్నతాధికారులు త్వరలోనే ప్రకటించనున్నారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రారంభించనున్నారు. రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంటూరు, నెల్లూరు స్టేషన్లలోనే నిలుపుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏప్రిల్‌ 10న పట్టాలెక్కనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని