logo

బుల్లెట్‌ గాయానికి ముగిసిన శస్త్రచికిత్స

వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్‌ మస్తాన్‌ బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది.

Published : 31 Mar 2023 02:32 IST

ఐదురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ

చిత్తూరు(నేరవార్తలు): వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్‌ మస్తాన్‌ బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు భరత్‌కుమార్‌రెడ్డి శస్త్రచికిత్స చేసి ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అతడి తొడ భాగంలో బుల్లెట్‌ పెల్లెట్లు గుర్తించి తొలగించారు. మోచేయి పైభాగం, కింది భాగంలో దెబ్బతిన్న ఎముకలు సరిచేశారు. తొడ భాగంలో ఓ పెద్ద పెల్లెట్‌, చిన్న పెల్లెట్‌తో పాటు గన్‌పౌడర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆ రెండు తొడ భాగంలోని సయాటిక్‌ నరం వెనుక భాగంలో ఉండటంతో వాటిని తీయడానికి సాహసించక వదిలిపెట్టారు. వాటితో ప్రమాదం లేదని, నరం వెనుక ఆనుకుని ఉన్న దాన్ని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు నరం దెబ్బతింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యుడు తెలిపారు. దీంతో గన్‌పౌడర్‌ను మాత్రమే తొలగించి కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మరోవైపున అతడి ఆరోగ్యంపై పులివెందుల నాయకులు, పోలీసులు వాకబు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని