logo

విద్యార్థులకు పరీక్షే!

ఏప్రిల్‌ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి.

Updated : 01 Apr 2023 05:32 IST

కేంద్రాల్లో నాడు-నేడు పనుల నిర్మాణ సామగ్రి
చాలీచాలని ఫ్యాన్లు
తప్పని తాగునీటి ఇబ్బందులు

ఏప్రిల్‌ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి. చివరకు కేంద్రాల్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. నాడు-నేడు పనులు జరిగే వాటిని కూడా కేంద్రాలుగా ఎంపిక చేసినా నిర్మాణ సామగ్రిని బడి ఆవరణలోనే నిల్వ చేయడం గమనార్హం. వీటిని దాటుకుంటూనే గదిలోకి చేరాలి.  ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు తప్పనిసరి. కొన్ని కేంద్రాల్లో సక్రమంగా లేవు. మరికొన్ని చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి.  ఇవన్నీ విద్యార్థులకు పరీక్షలు పెట్టనున్నాయి. అధికారులు స్పందిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.


విద్యుత్తు కనెక్షన్‌ లేక..

వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పాఠశాలలో నాడు-నేడు పనులు సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఇసుక, కంకర, ఇటుకలు పాఠశాల ఆవరణలో ఉంచారు. గదుల్లో ఫ్యాన్లు ఉన్నా విద్యుత్తు కనెక్షన్‌ లేకపోవడంతో పనిచేయడం లేదు. ఫలితంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ పరీక్షలు రాయాల్సి ఉంది.

న్యూస్‌టుడే, పెనుమూరు


రాళ్లతోనే ఇబ్బందులు

మండలంలోని కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 72 మంది పరీక్షలు రాస్తారు. నెల్లిపట్ల, నక్కపల్లె గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడే రాయాలి. సరిపడా గదులున్నా ఆవరణలో అసంపూర్తి నిర్మాణాల కారణంగా ఉన్న మట్టి, కంకరతో ఇబ్బంది తప్పదు. చిన్న చిన్న రాళ్లు కాళ్లకు తగులుకుని అవస్థలు పడుతుంటారు. పరీక్షల కోసం 6 గదులను ఎంపిక చేశారు. అందులో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నీటి వసతి కూడా ఉంది.

న్యూస్‌టుడే, పలమనేరు


కొనసాగుతున్న పనులు

పుంగనూరు బీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కింది అంతస్తులో పరీక్షలు రాయాల్సి ఉండగా పైన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 240 మంది పరీక్షలు రాస్తున్నారు.  నిర్మాణ పనులు ఆపకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముంది.

న్యూస్‌టుడే, పుంగనూరు


చాలీచాలని ఫ్యాన్లు

శాంతిపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో 200 మంది వరకు రాస్తారు. తరగతి గదుల్లో ఒక్కో ఫ్యాన్‌ మాత్రమే ఉంది. అవి కూడా ఉపాధ్యాయుల బోధన.. బోర్డులకు సమీపంలోనే ఉన్నాయి. విద్యార్థులు ఉక్కపోత నడుమ పరీక్షలు రాయాల్సిన ‘దు’స్థితి ఏర్పడనుంది. నాడు- నేడు ద్వారా చేపట్టిన మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి కాలేదు. కొత్తవాటి నిర్మాణం పునాది దశలో ఆగిపోయింది. బాలురకు రెండు, బాలికలకు రెండు వంతున మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్‌టుడే, కుప్పం  


బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు

మండలంలోని పోలవరం పరీక్ష కేంద్రంలో 56 మంది పరీక్షలు రాయనున్నారు. బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు, కంకర, గ్రానైట్‌ బండలు దర్శనమిస్తున్నాయి. తరగతి గదుల్లో సిమెంటు బస్తాలు ఉంచారు. దీనిపై ఎంఈవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూస్‌టుడే, పూతలపట్టు (ఐరాల)


పకడ్బందీ ఏర్పాట్లు  

విద్యార్థులకు డెస్క్‌లు ఏర్పాటు చేశాం. తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలి. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

విజయేంద్రరావు, డీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని