logo

వగరు మిగుల్చుతోన్న మామిడి

జిల్లాలో మామిడి ధరలు ప్రస్తుతం మిడిమిడిగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు, బంగారు పాళ్యం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలోని మామిడి కాయల యార్డుల్లో మామిడి వ్యాపారం కాస్తా జోరందుకుంది.

Updated : 02 Jun 2023 05:25 IST

మిడిమిడిగా ధరలు
నష్టపోతున్న రైతులు

చిత్తూరు యార్డుకు వచ్చిన తోతాపురి కాయలు

ఎంతో ఆశతో మామిడి సాగు చేసిన రైతులు తీరా సీజన్‌ వచ్చాక తీపి కబురు అందుతుందను కుంటే అదికాస్తా వారికి వగరు మిగిల్చింది.. దిగుబడి ఆశించిన మేర రాకున్నా ఉన్నంతలో అందుబాటులో ఉన్న కాయలకు మంచి ధర వస్తుందనుకుంటే రోజురోజుకూ వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి.. యార్డుల్లోని మండీల్లో క్రయవిక్రయాలు ఊపందుకున్నా ధర మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం మామిడి రైతులకు ఆశనిపాతంగా మారింది.

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లాలో మామిడి ధరలు ప్రస్తుతం మిడిమిడిగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు, బంగారు పాళ్యం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలోని మామిడి కాయల యార్డుల్లో మామిడి వ్యాపారం కాస్తా జోరందుకుంది. ఈ క్రమంలోనే మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయల తరలింపు ఊపందు కుంది.

దిగుబడులు తగ్గడం వల్ల ధరలు బాగుంటాయని సంబరపడిన రైతులకి ధరలు పెరగకపో వడం, నిలకడగా, మిడిమిడిగా ధరలు ఉండటంతో రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అని తెలియని ఆందోళన స్థితిలో ఉన్నారు. ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. కనీసం పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అని సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే చాలా మేర అప్పులు చేసి మామిడిని సాగుచేస్తుంటే ఈ పరిస్థితి తమను మరింత కుంగదీస్తోందని వాపోతున్నారు.

తోతాపురి మామిడి కోతలు ఈ నెల(జూన్‌) రెండో వారానికి పూర్తిగా ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం తోతాపురి కాయలు టన్ను ధర ర్యాంపుల వద్ద రూ.13-15 వేలు పలుకుతోంది. అదే గుజ్జు పరిశ్రమల వద్ద రూ.13-14 వేలు చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఫలితంగా నష్టాలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. జిల్లా అధికారులు.. ఈ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తే తప్ప మామిడికి ఈ ఏడాది మంచి ధర వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. మార్కెట్‌ యార్డుల్లో మామిడి ధరల వివరాలు ఇలా..

* చిత్తూరు యార్డులో తోతాపురి(కలర్‌ కాయ) టన్ను ధర రూ.16-20 వేలు, బేన్నీషా రూ.16-24 వేలు, పులేరా రూ.13-20 వేలు.

* బంగారుపాళ్యం యార్డులో.. బేన్నీషా రూ.20-25 వేలు, కాదర్‌ రూ.35-45వేలు, పులేరా రూ.14-19 వేలు.

కలెక్టర్‌ ప్రకటించిన ధర ఎక్కడ?

తోతాపురి మామిడి టన్నుకు రూ.19వేలు చెల్లించాలని కలెక్టర్‌ షన్మోహన్‌ మే నెల పదో తేదీన గుజ్జుపరిశ్ర మల నిర్వహకులు, రైతులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రకటించారు. అయితే నాటినుంచి నేటి వరకు కనీసం ఒక్కరోజయినా జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు తోతాపురికి రూ.19వేలు చెల్లించిన దాఖలాల్లేవు. మామిడి రైతులను ఆదుకోవాలని స్వయంగా కలెక్టర్‌ చెప్పినా పట్టించుకోకపో వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని