logo

చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!

భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి.

Updated : 29 Mar 2024 04:57 IST

వెలవెల బోతున్న చెరువులు
పొంచి ఉన్న తాగునీటి ముప్పు

ఈనాడు-తిరుపతి: భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. దీనికితోడు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మిగిలిన చెరువుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.

జిల్లా పరిధిలో అత్యధికంగా యర్రావారిపాలెం మండలంలో ఏకంగా 108 చెరువులు పూర్తిగా అడుగంటాయి. బోడేవాండ్లపల్లె పరిధిలోని 49 చిన్న చెరువుల్లో 16.61 ఎంసీఎఫ్‌టీలకు 6.19 ఎంసీఎఫ్‌టీల నీరే ఉంది. 35 చెరువుల్లో 25 శాతం, మరో 2 చెరువులు పూర్తిగా అడుగంటాయి. ఎలమందలో 33 చెరువుల్లో చుక్కనీరు లేదు. కేవీబీపురం మండలంలోని 125 చెరువులకు 1348.57 ఎంసీఎఫ్‌టీల నీటి నిల్వ సామర్థ్యం కాగా.. 327.59 ఎంసీఎఫ్‌టీ మాత్రమే ఉంది. వంద చెరువులు అడుగంటాయి. కొవనూరులో 11, పెరిందేశంలో ఆరు చెరువులు అడుగంటాయి.
ఆక్రమణలతో..: వైకాపా అధికారంలోకి వచ్చాక చెరువులు అనేకం ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మట్టిని తరలించడంతో చెరువుల రూపురేఖలు మారిపోయాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో భూముల్లోకి నీరు ఇంకడం లేదు. పరిసరాల్లోని బోర్లు సైతం అడుగంటిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో కాలువలు ఆక్రమించడంతో వర్షాలు కురిసినా నీళ్లు చెరువులకు చేరడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీటి ఆక్రమణలు మరింత పెరిగాయి.


గొలుసుకట్టు.. తీసికట్టు..: రాయలవారి కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. దీనివల్ల ఒక చెరువు నిండిన తర్వాత కాలువల ద్వారా మరో దాంట్లోకి నీరు చేరేవి. ఇప్పుడవి పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ కాలువల్లో నిర్మాణాలు చేపట్టడంతో గొలుసుకట్టు చెరువులకు నీరు చేరే పరిస్థితి కనిపించడం లేదు.


వర్షాభావ పరిస్థితి..

తుపాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా జిల్లాలో సాధారణ వర్షపాతం సైతం నమోదు కాలేదు. గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే జిల్లాలో 1027.39 ఎంఎం సాధారణ వర్షపాతం కాగా 974.07 ఎంఎం మాత్రమే పడింది. ఓజిలిలో 36.21,  బాలాయపల్లెలో 35.28, వెంకటగిరిలో 29.12 శాతం, నాయుడుపేటలో 25.89 శాతం అత్యల్ప వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని