logo

గరం గరం.. పశుగ్రాసం

వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు.

Published : 29 Mar 2024 02:39 IST

ధరలతో హడలిపోతున్న అన్నదాతలు
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
న్యూస్‌టుడే, బంగారుపాళ్యం

ర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు.. వేసవి వచ్చేయగానే ముందస్తు జాగ్రత్తలతో అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జిల్లాలో కీలకమైన చిత్తూరు, పూతలపట్టు ప్రాంతాల్లోని పెద్దఎత్తున పశువులు, మేకలు, గొర్రెలు మేత లేక అలమటిస్తున్నాయి.
జిల్లాలో రైతుల ప్రధాన జీవనాధారం పాడిపశువులు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు పాల దిగుబడిపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. నాలుగు నెలలుగా వరుణ దేవుడు కన్నెర్ర చేశాడు. దీనికితోడు రోజురోజుకు ఎండలు తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటాయి. పచ్చిక బయళ్లు కనుమరుగయ్యాయి. మూగజీవులకు మేత కరవు కావడంతో అవి నానా తిప్పలు పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటి పశుగ్రాసం సాగు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పశుపోషణ భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు వెచ్చించి పశుగ్రాసం  కొనుగోలు చేసి పశువులకు మేత వేస్తున్నారు.

చుట్ట గడ్డి.. రూ.210

పశుగ్రాసం కొరత తీవ్రం కావడంతో వరి ధరలు అధికమయ్యాయి. చుట్ట ఎండు వరి గడ్డి ధర రూ.210 పలుకుతోంది. దీంతో దీన్ని కొనుగోలు చేసి పశువులకు మేత వేస్తున్నారు. పశువుల పౌష్టికాహారమైన గానుగ పిండి, పశువుల దాణా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో పాల ధర మాత్రం పెరగలేదని రైతులు వాపోతున్నారు. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సరిహద్దు తమిళనాడు ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాల్లో వరి గడ్డి తెచ్చి చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక ధర వెచ్చించి పశుగ్రాసాన్ని రైతులు కొనుగోలు చేస్తున్నారు. నాలుగు నెలలు కిందట వరి గడ్డి రూ.90 నుంచి రూ.110 ధర పలకడం గగనంగా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.210కి చేరడం గమనార్హం.


రాయితీపై జొన్న, మొక్కజొన్న విత్తనాలు..

-డాక్టర్‌ ఆసిఫ్‌, ఏడీ, బంగారుపాళ్యం

శుగ్రాసం సమస్య అధిగమించేందుకు రెండు టన్నుల జొన్నలు, మొక్కజొన్నల విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపాం. విత్తనాలు జిల్లాకు సరఫరా అయిన వెంటనే రాయితీపై రైతులకు అందజేస్తాం.


రాయితీ దాణా ఇవ్వడం లేదు..

-గురుస్వామి, పాడిరైతు, తుంబపాళ్యం

పాడిరైతుల అభ్యున్నతికి గత ప్రభుత్వ హయాంలో రాయితీపై పశువుల దాణా పంపిణీ చేసేవారు. పశుపోషణ శిబిరాల ద్వారా ఉచితంగా గ్రాసం పంపిణీ చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాడిరైతుల సమస్యలు పట్టించు కోవడం లేదు. రోజుకు రూ.210 వెచ్చింది కొనుగోలు చేస్తున్నా గడ్డి చాలడం లేదు. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు. జిల్లాలోని వేలాది మందిది. పాడిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని