logo

జగన్‌ ‘లూటీ’ ఛార్జి

పుత్తూరు నుంచి బెంగళూరుకు గతంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో రూ.230 ఛార్జీ వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.300 తీసుకుంటున్నారు. ఒకేసారి రూ.70 పెంచారు. అదే అల్ట్రా డీలక్స్‌కు గతంలో రూ.330.. ఇప్పుడు రూ.450కు చేరింది.

Updated : 11 Apr 2024 05:21 IST

వైకాపా పాలనలో ఆర్టీసీ బాదుడు
ఎడాపెడా పెంచి.. పేదల నడ్డి విరిచి
ఇదీ జిల్లాలో దుస్థితి

పుత్తూరు నుంచి బెంగళూరుకు గతంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో రూ.230 ఛార్జీ వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.300 తీసుకుంటున్నారు. ఒకేసారి రూ.70 పెంచారు. అదే అల్ట్రా డీలక్స్‌కు గతంలో రూ.330.. ఇప్పుడు రూ.450కు చేరింది. ఒకేసారి రూ.120 భారం పేద, మధ్య తరగతి ప్రజలపై పడింది. బస్సులైనా సామర్థ్యంతో ఉన్నాయా అంటే గమ్యస్థానం ఎప్పుడు చేరుకుంటామో తెలియని దుస్థితి.

చిత్తూరు నుంచి తిరుపతికి గతంలో ఛార్జీ రూ.70 ఉండగా ప్రస్తుతం రూ.110 వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఏ బస్సు ఏ మార్గంలో వెళ్తుందో తెలియని స్థితి. ఒక బస్సు కపిలతీర్థం, అలిపిరి, రుయా, బాలాజీ కాలనీ, చంద్రగిరి మీదుగా వెళ్తే మరొకటి కపిలతీర్థం, బాలాజీ కాలనీ, మహిళా యూనివర్సిటీ మీదుగా వెళ్తుంది. కొన్ని సర్వీసులు మార్కెట్‌యార్డు మీదుగా బైపాస్‌లో వెళ్తుంటాయి. దీంతో ప్రయాణికుల తిప్పలు చెప్పనలవికావు.

పలమనేరు-మదనపల్లెకు గతంలో రూ.55 ఛార్జీ. ప్రస్తుతం రూ.70. పలమనేరు నుంచి కుప్పానికి గతంలో రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.90.

పుత్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఏ రంగంలో తీసుకున్నా బాదుడే బాదుడు.. అని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్‌.. ఎన్నికల సందర్భంగా ప్రతి బహిరంగ సమావేశంలో ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు. ఒకే సారి దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.120 పెంచేశారు. వచ్చే ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేశారా అంటే అదీ లేదు. డొక్కు బస్సులే దిక్కు. జిల్లాలో 467 ఆర్టీసీ సర్వీసులున్నాయి. అందులో 20 శాతం బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు డిపోల పరిధిలోని 467 సర్వీసులను తిప్పుతున్నారు. నిత్యం లక్షల మందిని తీసుకెళ్తున్న ఆర్టీసీ సర్వీసుల సామర్థ్యం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. పలమనేరు ఆర్టీసీ డిపోలో 69 సర్వీసులు కుప్పం, తిరుపతి, తిరుమల, మదనపల్లె, తదితర మార్గాల్లో నడుస్తున్నాయి. ఏ సర్వీసు ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందే పరిస్థితి. కుప్పం డిపో పరిధిలోని పలు బస్సులు ఆగిపోయిన సందర్భాలున్నాయి. పుత్తూరు-చిత్తూరు మార్గంలో ఇదే పరిస్థితి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. కొత్త బస్సుల కొనుగోలు మరిచి.. ఉన్న వాటికే మరమ్మతులు చేసి తిప్పుతున్నారు.

పలమనేరు-కుప్పం మార్గంలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు

20 శాతం బస్సులు కండిషన్‌ లేనివే..

వివిధ మార్గాల్లో 20శాతం సర్వీసులు కండిషన్‌ లేనివే నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఇంజిన్లు మరమ్మతులు చేసి వాటినే తిప్పుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే బస్సులయితే మరీ అధ్వానంగా ఉన్నాయి.


భారం మోపారు..

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు ఒకే సారి భారీగా పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడింది. గతంలో పళ్లిపట్టు నుంచి కర్ణాటకలోని హొస్‌కోటకు రూ.200 వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.250 వసూలు చేస్తున్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణ ఖర్చులు పెంచి నడ్డి విరిచారు.

కేశవులు, కేబీఆర్‌పురం, పుత్తూరు మండలం


ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమన్నారు

తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచారు. ఆయన బటన్‌ నొక్కి నగదు బదిలీ చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్న విషయం ప్రజలు గమనించాలి.

బాలిరెడ్డి, పుత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని