logo

వరదొచ్చింది.. ఊడ్చేసింది

గోదావరి ఉగ్రరూపం రైతులను నిలువునా ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పీకల్లోతు కష్టనష్టాల్లోకి నెట్టేసింది. జులై రెండోవారం నుంచి నెలాఖరువరకు కురిసిన వర్షాలకు తోడు.. ఎగువనుంచి పోటెత్తిన వరద 20 రోజులపాటు కాలు కదలనీయలేదు. తాజాగా ఎగువన వర్షాలతో మరోమారు అదే స్థాయిలో

Published : 16 Aug 2022 06:36 IST

ముమ్మిడివరం: గేదెల్లంకలో తోటల్లోకి మళ్లీ చేరిన వరద

ఈనాడు-అమలాపురం, న్యూస్‌టుడే-ముమ్మిడివరం: గోదావరి ఉగ్రరూపం రైతులను నిలువునా ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పీకల్లోతు కష్టనష్టాల్లోకి నెట్టేసింది. జులై రెండోవారం నుంచి నెలాఖరువరకు కురిసిన వర్షాలకు తోడు.. ఎగువనుంచి పోటెత్తిన వరద 20 రోజులపాటు కాలు కదలనీయలేదు. తాజాగా ఎగువన వర్షాలతో మరోమారు అదే స్థాయిలో గోదావరి విరుచుకుపడుతోంది. గత నెల వరదల ప్రభావం డా.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 18, తూర్పుగోదావరి జిల్లాలో 13 మండలాలపై చూపింది. పొరుగున ఉన్న అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఏడేసి మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో మూడు, కాకినాడలో ఒక మండలంపైనా కనిపించింది. మొత్తంగా 467 గ్రామాల్లోని 3.66 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. 6జిల్లాల్లో 389 గ్రామాలు ముంపునకు గురైతే.. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 205 గ్రామాలు నీట మునిగాయి. ఏలూరు జిల్లాలో 76, కోనసీమ జిల్లాలో 53, పశ్చిమగోదావరిలో 33, తూర్పుగోదావరిలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏడుగురు మృత్యువాత పడ్డారు. 3,467 హెక్టార్లలో వ్యవసాయ, 8,614 హెక్టార్లలో ఉద్యాన పంటలు మునిగాయి. గత నెలలో భద్రాచలం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీల వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేస్తే.. తాజాగా మూడు రోజులుగా వరదలతో రెండో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఖరీఫ్‌ సాగుకు ఆదిలోనే వరదలు విఘాతం కలిగిస్తే.. చేతికందిన ఉద్యాన పంటలు వేల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయాయి. వరద తగ్గాక మళ్లీ నారు వేసేందుకు కొందరు సమాయత్తమైతే, ఆ పొలాలు మళ్లీ మునిగాయి. దీంతో సీజన్‌పై ఆశలు వదులుకున్నారు. కోనసీమ పరిధిలోనే 213.82 హెక్టార్లలో వరి నారుమళ్లు, 6,402 హెక్టార్లలో ఉద్యాన పంటలు.. తూర్పుగోదావరిలో 1,145 హెక్టార్లలో వరి నారుమళ్లు, 1,951 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. కడియం నర్సరీ, పూల తోటలూ ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరిలో 242 హెక్టార్లలో వరి, 247 హెక్టార్లలో ఉద్యాన పంటలు, అల్లూరి జిల్లాలో 1,502 హెక్టార్లలో వ్యవసాయ పంటలు మునిగాయి. ప్రత్యేక బృందాలతో పంట నష్టం అంచనాలు కొలిక్కివస్తున్న తరుణంలో మరోమారు వరద పోటెత్తింది. 2 నెలలుగా వ్యవసాయ, ఉపాధి పనులకు దూరమైన బాధితులు పంటలపైనా ఆశలు వదులుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.2వేల సాయం ఎటూ చాలని పరిస్థితి నెలకొంది. ‌్ర సాగుదారుల్లో 90శాతం కౌలు రైతులే కావడంతో వరుస విపత్తులతో కుంగిపోతున్నారు. అరటి, మిర్చి పంటలకు ఎకరాకు రూ.50 వేలకుపైనే నష్టపోతే, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.30-40 వేలు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరాకు రూ.20-25వేల చొప్పున కౌలు చెల్లించే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏటా రెండు, మూడు  విపత్తులను ఎదుర్కొంటూ పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో చాలామంది సాగుకు దూరమవుతున్నారు. పొలాల్లో ఇసుక మేటలూ ఇబ్బందిగా మారాయి.


పనుల్లేక యాతన

జులై వరదలతో మూడు వారాలు అవస్థలు పడ్డాం. వరద ముంచెత్తడంతో ఆర్థికంగా దెబ్బతిన్నాం. పనుల్లేక ఇంటిల్లిపాదీ సతమతమవుతున్నాం. వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటే మళ్లీ వచ్చేస్తోంది. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మాలాంటోళ్లు ఈ పరిస్థితుల్లో ఎలా బతికేది..? పరిహారంగా ఇచ్చిన రూ.2 వేలు ఇల్లు బాగుచేసుకోవడానికి కూడా చాలలేదు.

-కొమ్ముల ఏసు, పెదపట్నంలంక, మామిడికుదురు


పంటలన్నీ కుళ్లిపోయాయి..

ఊహించని విధంగా ఈ ఏడాది జులైలోనే వరదలొచ్చాయి. ఎకరన్నరలో వంగ, బెండ, మిరప వేశా. అన్నీ వరదకు తుడిచిపెట్టుకుపోయాయి. 15రోజులపాటు పంటలు ముంపులోనే ఉండడంతో కుళ్లాయి. రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టపోయా. వరద తగ్గిందనుకుంటే మళ్లీ పొలాల్లోకి చేరింది. మరో నెల వరకు కొత్త పంటలేసే అవకాశం లేదు.

- పట్టాభిరామప్రసాద్‌, లంక ఆఫ్‌ ఠాణేలంక, ముమ్మిడివరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని