logo

Andhra News: మేనకోడలితో రెండో పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశాడు..

 మేనకోడలితో రెండోపెళ్లికి ఆమె తండ్రి నిరాకరించాడని, అతణ్ని చంపి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి కాల్చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గతనెల 27న గోపాలపురం మండలంలోని భీమోలు రోడ్డులోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరిగింది. అప్పట్లో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారించారు.

Updated : 06 Oct 2022 06:55 IST

వివరాలు వెల్లడిస్తున్న క్రైమ్‌ అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వరరావు

గోపాలపురం, న్యూస్‌టుడే: మేనకోడలితో రెండోపెళ్లికి ఆమె తండ్రి నిరాకరించాడని, అతణ్ని చంపి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి కాల్చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గతనెల 27న గోపాలపురం మండలంలోని భీమోలు రోడ్డులోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరిగింది. అప్పట్లో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారించారు. సీసీ కెమెరాల ద్వారా విచారించి హంతకులను పట్టుకున్నారు. దేవరపల్లి సర్కిల్‌ కార్యాలయం వద్ద క్రైమ్‌ అడిషనల్‌ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 27న పోలవరం కుడి కాలువ గట్టుపై గుర్తు పట్టడానికి వీలులేని విధంగా మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. భీమోలు రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం బుసురాజుపల్లికి చెందిన ఆదిమూలం ఏసుపాదాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తించి విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి.
పెళ్లికి నిరాకరించాడనే..
ఏసుపాదానికి గతంలో పెళ్లి కాగా, భార్య గొడవపడి పాపతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడులోని తన అక్క కూతురిని రెండోపెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వివాహం చేయమని బావను కోరగా అతడు నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. అతణ్ని హత్య చేసేందుకు బుట్టాయగూడేనికి చెందిన దార రామచంద్రరావు, బేతాళ శేఖర్‌, కొల్లి పవన్‌కల్యాణ్‌తో కలిసి రూ.రెండు లక్షలు సుపారీ కుదుర్చుకున్నాడు. వాళ్ల పథకంలో భాగంగా బావ రాజును గతనెల 27న ఇంటికి పిలిచి అందరూ కలిసి మద్యం తాగారు. ఇంకా తాగుదామని చెప్పి పవన్‌కల్యాణ్‌ కారులో, సమీపంలోని పోగొండ ప్రాజెక్టు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో వారి వెంట తెచ్చుకున్న ఇసుప రాడ్డుతో రాజు మెడ వెనుక భాగంలో కొట్టి చంపారు. సాక్ష్యాలు ఉండకూడదని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కొయ్యలగూడెంలో పెట్రోలు బంకులో పెట్రోల్‌ కొని గోపాలపురం వచ్చారు. అక్కడి నుంచి సమీప కాలువ గట్టుకు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చేశారు. కేసు ఛేదించిన డీఎస్పీ శ్రీనాథ్‌, సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్సైలు రామకృష్ణ, శ్రీహరి, రవీంధ్రబాబు, ఇతర సిబ్బందిని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని