logo

తలపడు... నిలబడు

ఆయనో గురువు.. తన స్థానాన్ని మరచి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన ఇటీవల జేఎన్‌టీయూకేలో జరిగింది.

Updated : 07 Dec 2022 04:13 IST

న్యూస్‌టుడే, కాకినాడ(వెంకట్‌నగర్‌)

ఆయనో గురువు.. తన స్థానాన్ని మరచి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన ఇటీవల జేఎన్‌టీయూకేలో జరిగింది. జగ్గంపేటలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై కొంతమంది తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఈ తరహా వెలుగులోకి వస్తున్నవి కొన్నే.. మరుగున ఉంటున్నవి ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. విద్యాలయాలు, పని ప్రదేశాల్లో ఒక తరహా వేధింపులు ఉంటుంటే.. గృహాల్లో బంధుత్వం ముసుగులో మృగాళ్లు బాలికలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాకినాడలోని దిశ వన్‌స్టాప్‌లో నమోదైన గృహహింస, అత్యాచారం, లైంగిక వేధింపులు, యాసిడ్‌ దాడులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, కిడ్నాప్‌ తదితర కేసులు పరిశీలిస్తే.. అత్యధికంగా 18ఏళ్ల లోపు వయసు వారిపై ఎక్కువగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనల్లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న వారు అయిదు శాతానికి మించడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ భయాలు...

* పేద, మధ్య తరగతి ఆడపిల్లలు ‘నిందితునికి శిక్షపడటం కన్నా పరువే ముఖ్యమని భావిస్తున్నారు.

* కుటుంబ నేపథ్యం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పెద్దల పంచాయతీలోనే న్యాయం కోరుతున్నారు.

* తమ ప్రమేయం లేని దాడిలో అవమాన భారంతో విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

* ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కుంగుబాటుకు గురవుతున్నారు.

* నమ్మి మోసపోయామని.. తల్లిదండ్రులకు తెలిస్తే వారు ఎలాంటి శిక్ష విధిస్తారోనన్న ఆందోళన, నిందితులు ప్రతీకారం తీర్చుకుంటారనే భయం నోరు మెదపకుండా చేస్తోంది.

సైబర్‌ వేధింపులపై సహాయానికి: 91212 11100


బయటకు రావాలి..

వేధింపులు, హింసకు గురైన 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సహా మహిళలందరికీ దిశ వన్‌స్టాప్‌ కేంద్రం రక్షణ కల్పిస్తుంది. కుటుంబం, కార్యాలయాలు, విద్యాలయాలు ఏ ప్రదేశంలోనైనా మహిళలు, బాలికలకు కావలసిన మద్దతు అందిస్తుంది. వారికి ఎదురవుతున్న సమస్యను స్త్రీ, శిశు సంక్షేమశాఖకు, పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. బాధితులు కుంగిపోకుండా ఉండేందుకు మానసిక, సామాజికపరమైన కౌన్సెలింగ్‌ అవసరం.

- డీఏఎస్‌ శ్రావ్య, లీగల్‌ కౌన్సిలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని