logo

గడప దాటనిధి.. గోడు తీరనిది

‘గడప గడపకు మన ప్రభుత్వం’ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇంటింటా తిరుగుతూ గుర్తించిన సమస్యలన్నీ ఎన్నికల్లోపు పరిష్కరించాలనేది లక్ష్యం.

Updated : 28 Mar 2023 05:45 IST

ఈనాడు, కాకినాడ: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇంటింటా తిరుగుతూ గుర్తించిన సమస్యలన్నీ ఎన్నికల్లోపు పరిష్కరించాలనేది లక్ష్యం. క్షేత్రంలో సమస్యలు గుర్తిస్తున్నా.. ఆశించిన రీతిలో పరిష్కారానికి చొరవ లేదు.  కార్యక్రమం 10 నెలల కిందట ప్రారంభమైనా హామీల అమలులో ప్రగతి ఆశించిన తీరులో సాగక పీడిత ప్రాంత ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే గడప గడపకూ వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు కొందరు నేటికీ సీరియస్‌గా తీసుకోకపోవడం ఓ సమస్య అయితే.. గుర్తించిన సమస్యలకూ నిధుల లేమి, సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారడం మరో సమస్యగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో తామేం చేశామో ప్రజలకు వివరించడంతోపాటు.. ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడంలోనూ వెనుకబాటు దర్శనమిస్తోంది.


సమస్యల మోత...

పింఛన్లు రావడంలేదని కొందరు.. ఇళ్లు మంజూరు కాలేదని ఇంకొందరు.. ప్రభుత్వ పథకాలు అందడంలేదని.. అర్హత ఉన్నా ఏ సాయమూ అందలేదని మరికొందరు.. అడపాదడపా గళం విప్పుతున్నారు. రోడ్లు బాగాలేవు.. కాలువలు అధ్వానం.. వర్షం పడితే ముంపు.. తాగునీటి సమస్య వేధిస్తోంది.. ఇలా గడప గడపలో ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకుల ఎదుట ప్రజలు సమస్యలను ఏకరవు పెడుతున్నారు. అన్నీ పరిష్కరిస్తామని చెబుతున్నా.. ఇన్నాళ్లూ పట్టించుకోలేదు ఇంకేం పట్టించుకుంటారని అసహనంతో కొందరు నిలదీస్తున్నారు. ఇంకొందరు నాయకుల మాటలను నమ్మి పనుల పూర్తిని ఆశిస్తున్నారు.


బిల్లులు రావని సంశయం

కడియం: రాజమహేంద్రవరం గ్రామీణంలో ఏడు గ్రామాల్లో రూ.1.04 కోట్లతో 15 పనులు చేయాలని నిర్ణయిస్తే.. అయిదు పనులు పూర్తయ్యాయి. వీటిలో నాలుగు పనులకు రూ.80 లక్షలు చెల్లించారు. కడియం మండలంలో ఎనిమిది పనులకు గుత్తేదారులు ముందుకు రాలేదు. పనులు చేశాక బిల్లులు మంజూరుపై అనుమానాలే ఈ పరిస్థితికి కారణం. దీంతో రూ.1.05 కోట్లతో చేపట్టాల్సిన ఈ 24 పనుల పూర్తిపై సందిగ్ధం నెలకొంది. దీంతో దిగువ శ్రేణి నాయకులు పనుల పూర్తికి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.


వివిధ దశల్లో 145 పనులు

కొవ్వూరు: మద్దూరులో రహదారి నిర్మాణం

కొవ్వూరు పట్టణం: నియోజకవర్గంలో రూ.42.5 లక్షల విలువైన 16 పనులే పూర్తయ్యాయి. 145 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేసిన పనులకు రూ.25 లక్షలు బిల్లులు రావాలి. పనుల వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లో పెట్టినా ఎదురుచూపులే. చాగల్లు మండలంలో 16 పనులు చివరి దశలో ఉన్నా నిధులపై సందిగ్ధం నెలకొంది. తాళ్లపూడిలోనూ నిధుల లేమి ఇబ్బందిగా మారింది.


అడుగడుగునా ఆపసోపాలు..

నిర్దేశిత పనులకు గుత్తేదారులు ఆసక్తిచూపట్లేదు. దీంతో ఎక్కువ శాతం అధికార పక్ష నాయకుల అనుచరులే భుజాన వేసుకోవాల్సి వస్తోంది. చేసిన పనులకు బిల్లులు రాక.. కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పనులు సాగడం లేదు. బిల్లులు రాలేదన్న వాదన బాహాటంగా వినిపించలేక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.


రూ.1.54 కోట్లు ఇవ్వాలండి

బిక్కవోలు: తొస్సిపూడి రోడ్డు

బిక్కవోలు: అనపర్తి మండలంలో 29 పనులు మంజూరైతే 14 పనులు పూర్తిచేశారు. బిక్కవోలుకు 22 పనులు మంజూరైతే 11, పెదపూడిలో 37 పనులకు 10, రంగంపేట మండలంలో 33 పనులకు 16 పనులు మాత్రమే పూర్తయ్యాయి. నియోజకవర్గంలో పూర్తయిన 51 పనులకు రూ.1.54 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో అన్ని పనులు ప్రారంభించినట్లు చూపించినా.. క్షేత్రస్థాయి ప్రగతి మాత్రం భిన్నంగా ఉంది.


12 మాత్రమే  పూర్తి..

నిడదవోలు: నియోజకవర్గంలో 12 పనులు పూర్తయితే.. ఆరు పనులు వివిధ దశల్లో ఉంటే.. 26 పనులు మొదలు కాలేదు. బిల్లుల బకాయి సుమారు రూ.80 లక్షలు ఉంది.  


సాంకేతిక ఆటంకమనీ...

గోపాలపురం ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు

గోపాలపురం: నియోజకవర్గంలో ఇప్పటికి 25 పనులే పూర్తవగా 331 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. తొమ్మిది పనులు మొదలవలేదు. నల్లజర్ల మండలంలో 112 పనులకు 19 పూర్తిచేశారు. ఇక్కడ రూ.62 లక్షలకు రూ.24 లక్షలే విడుదలయ్యాయి. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ఆరు పనులైనా బిల్లులు కాలేదు. సీఎఫ్‌ఎంఎస్‌లో అడ్డంకులు కారణంగా చెబుతున్నారు.


నిధుల లేమితో ఇబ్బంది

రాజానగరం: నియోజకవర్గంలో 60 శాతం పనులు చేసినా.. రూ.95 లక్షల బిల్లులు బకాయిలు ఉన్నాయి. పనుల నెమ్మదికి ఇదే కారణం. పంచాయతీలు చేయాల్సిన పనులు కూడా గడప గడపకులో నమోదు చేసినట్లు తెలుస్తోంది. పనులు ప్రారంభించినా పూర్తికాకపోవడం.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం సమస్యగా మారింది.


అయిదు పనులే కొలిక్కి..

టి.నగర్‌: నగరంలో అయిదు పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.4.50 కోట్లతో 28 పనులు ప్రగతి దశలో ఉన్నాయి. ఇంకా 38 పనులు ప్రారంభించాల్సి ఉంది. టెండరు దశలో ఏడు పనులు ఉన్నాయి. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించలేదు. తాజాగా గడప గడపకు పనులకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పట్టాలెక్కించాల్సిఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని