logo

కట్టుకున్నోడే కడతేర్చాడు..

భార్యను భర్తే అతి కిరాతకంగా పీక కోసి హత్య చేసిన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో చోటు చేసుకుంది.

Published : 04 Jun 2023 05:27 IST

కనకదుర్గ (పాత చిత్రం)

మలికిపురం: భార్యను భర్తే అతి కిరాతకంగా పీక కోసి హత్య చేసిన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొల్లు కనకదుర్గ(34)ను ఆమె భర్త కొల్లు అచ్చారావు పీక కోసి దారుణంగా హతమార్చాడు. ఎస్సై సురేంద్ర చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి భార్య భర్తలు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో కత్తితో ఆమె పీక కోసి హత్య చేశాడు. చుట్టుపక్కల వారు లేచి వచ్చి చూసే సరికి కనకదుర్గ రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించారు. భార్య మృతి చెందిన అరగంట వరకు అక్కడే ఉన్న అచ్చారావు ఆ తర్వాత పారిపోయాడు. వీరికి 13 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. దివ్యాంగురాలైన కనకదుర్గను అత్యంత దారుణంగా చంపడాన్ని వారి బంధువులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చెప్పుడు మాటలు విని...

కనకదుర్గతో అచ్చారావుకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వడ్రంగి పని చేసుకునే అతను ఆ తర్వాత రొయ్యల సాగు చేశాడు. చెరువు లీజు గడువు ముగియడంతో ఉపాధి నిమిత్తం గత సెప్టెంబరు నెలలో గల్‌్్ఫ దేశానికి వెళ్లి జనవరిలో తిరిగి వచ్చేశాడు. చెప్పుడు మాటలు విని భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇంటికి తిరిగి వచ్చేశాడని చెబుతున్నారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పొన్నమండలో పుట్టింటికి వెళ్లిన భార్యను శుక్రవారం తూర్పుపాలెంలోని ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి కత్తితో పీక కోసి చంపేశాడు. సీఐ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై జి.సురేంద్ర కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు దొరికితే కాని హత్యకు అసలు కారణం తెలీదని ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని